కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం అయినప్పటికీ, రోజుకు ఎన్ని గుడ్లు తినాలి అనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. వయసు, ఆరోగ్య స్థితి, బరువు తగ్గించుకోవాలనే లక్ష్యం, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు వంటి అంశాలను బట్టి గుడ్ల వినియోగం మారుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సరైన మోతాదులో తీసుకుంటే గుడ్లు శరీరానికి పూర్తి పోషణ అందిస్తాయి.
తాజా నివేదికల ప్రకారం పరిమితంగా గుడ్లు తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడటంతో పాటు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుందని వెల్లడైంది. గుడ్లలో విటమిన్ ఏ, డీ, ఈ, బీ12, కోలిన్, ల్యూటిన్, జియాక్సానథిన్, అసంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యం, మెదడు పనితీరు, ఎముకల బలానికి సహాయపడతాయి.
గుడ్డు పచ్చసొనలో కొవ్వులో కరిగే ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ముఖ్యంగా మెదడు, కంటి ఆరోగ్యానికి అవసరం. తెల్లసొనలో స్వచ్ఛమైన ప్రొటీన్ మాత్రమే ఉండటంతో ఇది కండరాల బలానికి, శరీర శక్తికి అద్భుతమైన ఆహారంగా పనిచేస్తుంది. ఒక గుడ్డులో సుమారు 6–7 గ్రాముల ప్రొటీన్ ఉండటంతో పాటు శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు లభిస్తాయి.
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తినడం సాధారణంగా సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గినట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పరిమితిని మించి గుడ్లు తీసుకోవడం హానికరం కావచ్చని కూడా హెచ్చరిస్తున్నారు.
గుండె జబ్బులు, మధుమేహం, అధిక LDL కొలెస్ట్రాల్ ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు వారానికి నాలుగు నుంచి ఏడు గుడ్లకే పరిమితం కావాలని నిపుణుల సూచన. గుడ్లతో పాటు రోజువారీ ఆహారం, వంట పద్ధతులు, వ్యాయామం, నిద్ర, జీవనశైలి అన్నీ ఆరోగ్యంపై కీలక ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోవాలి.