అమెరికాలో దాదాపు 30 ఏళ్లుగా చట్టబద్ధంగా నివసిస్తున్న భారత సంతతి మహిళ బబ్లీజీత్ కౌర్ (60) ను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. గ్రీన్ కార్డు దరఖాస్తుకు సంబంధించిన బయోమెట్రిక్ ప్రక్రియ కోసం ఆమె యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) కార్యాలయానికి వెళ్లగా, అక్కడే ICE (ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్) ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అమెరికాలోని భారతీయ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ సంఘటన డిసెంబర్ 1న జరిగిందని బబ్లీ కౌర్ కుమార్తె జ్యోతి కౌర్ వెల్లడించారు. తన తల్లిని ఎటువంటి స్పష్టమైన కారణం చెప్పకుండా అరెస్ట్ చేశారని ఆమె తెలిపారు. ఆమె అటార్నీతో ఫోన్‌లో మాట్లాడినప్పటికీ, అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వకుండా రాత్రికి రాత్రే అడెలాంటో డిటెన్షన్ సెంటర్ కు తరలించారని చెప్పారు.
జ్యోతి కౌర్ తెలిపిన వివరాల ప్రకారం, డిటెన్షన్ సెంటర్‌లో బబ్లీ కౌర్‌ను ఇతర ఖైదీలతో కలిసి ఒక పెద్ద గదిలో ఉంచారు. వయోభారం కారణంగా ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బబ్లీ కౌర్ 1994 నుంచి అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తూ వస్తున్నారు. ఆమె భర్త కూడా గ్రీన్ కార్డు హోల్డరేనని లాంగ్ బీచ్ వాచ్‌డాగ్ సంస్థ వెల్లడించింది.
ఈ ఘటనపై లాంగ్ బీచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాబర్ట్ గార్సియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రీన్ కార్డు ప్రక్రియ కోసం వచ్చిన ఒక వృద్ధ మహిళను అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కౌర్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఆమెను త్వరగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.
బబ్లీ కౌర్ మరియు ఆమె భర్త గత 20 ఏళ్లుగా లాంగ్ బీచ్ ప్రాంతంలో ఒక రెస్టారెంట్ నిర్వహిస్తూ స్థానికులకు సుపరిచితులుగా ఉన్నారు. అంతకుముందు బబ్లీ కౌర్ 25 ఏళ్లపాటు ఒక ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం కూడా చేశారు. సామాజిక సేవలు, వ్యాపార కార్యకలాపాల ద్వారా స్థానిక సమాజంలో గుర్తింపు పొందిన ఈ కుటుంబంపై జరిగిన అరెస్ట్ ఘటన ఇప్పుడు అమెరికాలో వలస విధానాలపై మరోసారి చర్చకు దారి తీసింది.