Kumki Elephants: పార్వతీపురం మన్యానికి కుంకీ ఏనుగుల తరలింపు!

Kumki Elephants: పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు ఘర్షణలను సమర్థంగా నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్ మరియు అభిమన్యులను పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్నారు.

Kumki Elephants
Kumki Elephants

కుంకీ ఏనుగులకు ఘన స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..

గుచ్చిమి శిబిరానికి జయంత్, అభిమన్యు.. ఏనుగుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు..

అమరావతి/మంగళగిరి: పార్వతీపురం మన్యం జిల్లాలో మానవ-ఏనుగు ఘర్షణలను సమర్థంగా నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పలమనేరు ముసలమడుగు ఏనుగుల శిబిరం నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు జయంత్ మరియు అభిమన్యులను పార్వతీపురం మన్యం జిల్లా గుచ్చిమి ఏనుగుల శిబిరానికి తరలిస్తున్నారు.

మార్గమధ్యంలో మంగళగిరి క్యాంపు కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగులకు ఘన స్వాగతం పలికారు. గజరాజులకు పూలు చల్లి స్వాగతం తెలిపిన ఆయన, స్వయంగా ఆహారం అందించి వాటి యోగక్షేమాలను తెలుసుకున్నారు. అనంతరం గుచ్చిమి శిబిరానికి బయలుదేరిన కుంకీల రెండో దశ ప్రయాణాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రయాణం మొత్తం కుంకీ ఏనుగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. గుచ్చిమి శిబిరానికి చేరుకున్న తర్వాత అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి అడవి ఏనుగుల గుంపులు తరచుగా ప్రవేశిస్తూ రైతుల పంటలు, ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మానవ-ఏనుగు ఘర్షణలను తగ్గించేందుకు కుంకీ ఏనుగుల సేవలు ఎంతో కీలకంగా మారనున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ప్రజల ప్రాణాలు, రైతుల పంటలు, వన్యప్రాణుల సంరక్షణ అనే మూడు లక్ష్యాలను సమన్వయం చేస్తూ శాస్త్రీయ, మానవీయ విధానాలతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. కుంకీ ఏనుగులను వినియోగించడం కూడా అదే కార్యాచరణలో భాగమని వివరించారు.

జయంత్, అభిమన్యు కుంకీ ఏనుగులు గతంలో పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కీలక ఆపరేషన్లలో విశేష సేవలందించాయి. అడవి ఏనుగుల గుంపులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడంలో ఈ రెండు కుంకీలు సమర్థవంతంగా పనిచేసి మంచి ఫలితాలు సాధించాయి.

ఇప్పుడు ఈ రెండు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాలో వినియోగించడం ద్వారా మానవ-ఏనుగు ఘర్షణలు తగ్గడంతో పాటు, రైతుల పంటలకు రక్షణ కల్పించడం, అడవి ఏనుగులను సురక్షితంగా అటవీ ప్రాంతాలకు మళ్లించడం మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

Tags

Be the first to react

Latest