Pawan Kalyan: పంచదర్ల కొండ మైనింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశాలు!
Pawan Kalyan: అనకాపల్లి జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పంచదర్ల కొండలో జరుగుతున్న కంకర (గ్రావెల్) మైనింగ్‌పై పర్యావరణ ఉల్లంఘనల ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మైనింగ్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పంచదర్లలో పర్యావరణ ఉల్లంఘనలపై దర్యాప్తు.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు..
ఉల్లంఘనలు రుజువైతే మైనింగ్ కంపెనీపై కఠిన చర్యలు: పవన్ కళ్యాణ్..
అమరావతి: అనకాపల్లి జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పంచదర్ల కొండలో జరుగుతున్న కంకర (గ్రావెల్) మైనింగ్‌పై పర్యావరణ ఉల్లంఘనల ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మైనింగ్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ నిర్వహించి పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (APPCB) సమర్పించిన ప్రాథమిక నివేదికను పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాథమిక నివేదికలో ప్రస్తావించిన అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు జరిపి వాస్తవాలను వెలికితీయాలని స్పష్టం చేశారు.
విచారణలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే సంబంధిత మైనింగ్ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. పర్యావరణ నష్టానికి తగిన జరిమానాలు విధించడంతో పాటు, మైనింగ్ వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని పునరుద్ధరించే చర్యలు కూడా చేపట్టాలని సూచించారు.
పంచదర్ల ప్రాంతంలోని సహజ నీటి ఊటల నీటి నాణ్యతలో మార్పులు వచ్చినట్లు వచ్చిన నివేదికలపై పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ జలవిజ్ఞాన సంస్థ (National Institute of Hydrology) శాస్త్రవేత్తలను ఆహ్వానించి, సహజ నీటి ఊటలపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సహజ నీటి వనరులను కాపాడుతూ, వాటి నిరంతర ప్రవాహం కొనసాగేందుకు అవసరమైన చర్యలను శాస్త్రీయ నివేదిక ఆధారంగా చేపట్టాలని ఆయన సూచించారు.
మైనింగ్ ప్రభావం వల్ల పంచదర్లలోని చారిత్రక శ్రీ ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆలయ పరిరక్షణ కోసం పురావస్తు శాఖ మరియు దేవాదాయ శాఖ అధికారులు సంయుక్తంగా సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పంచదర్ల కొండ ప్రాంతాన్ని పూర్తిగా 'నో మైనింగ్ జోన్'గా ప్రకటించే దిశగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, గనుల శాఖ అధికారులకు ఉప ముఖ్యమంత్రి సూచించారు. అలాగే, ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైనింగ్ కంపెనీకి ఇచ్చిన పర్యావరణ అనుమతులు, స్థాపన అనుమతులు, కార్యకలాపాల అనుమతులను వెంటనే రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు.
ప్రకృతి సంపద, సహజ నీటి వనరులు, చారిత్రక దేవాలయాల సంరక్షణలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు. పర్యావరణానికి హాని కలిగించే కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పంచదర్ల కొండ మైనింగ్ వ్యవహారంపై ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు పర్యావరణ పరిరక్షణతో పాటు వారసత్వ సంపదను కాపాడే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.
Tags
Be the first to react