Pensions: ఉత్తరాంధ్రలో పెన్షన్లు జూలై 30నే.. ఆరు జిల్లాల్లో రూ.514.42 కోట్ల పంపిణీ!

Pensions: ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆరు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ఒక రోజు ముందుగానే, అంటే జూలై 30న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Minister Kondapalli Srinivas
Minister Kondapalli Srinivas

ఉత్తరాంధ్ర ఆరు జిల్లాల్లో ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ..

11.98 లక్షల మందికి రూ.514.42 కోట్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు..

అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆరు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ఒక రోజు ముందుగానే, అంటే జూలై 30న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ విషయాన్ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో, లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 11,98,044 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు రూ.514.42 కోట్ల మొత్తాన్ని జూలై 30న పంపిణీ చేయనున్నారు.

పెన్షన్ పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు అవసరమైన నగదు ఉపసంహరణను జూలై 29 నాటికే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా ఆరు జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ప్రతి అర్హులైన లబ్ధిదారునికి నిర్ణీత రోజునే పెన్షన్ అందేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. భారీ స్థాయి ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్నప్పటికీ, పెన్షన్ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేపడుతున్నామని చెప్పారు. ప్రజలకు సేవలందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Tags

Be the first to react

Latest