Polavaram: పోలవరం, వెలిగొండపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. 2027 మార్చికే పోలవరం పూర్తి!

Polavaram: పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఎల్‌నినో, సూపర్‌ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పనులకు స్పష్టమైన షెడ్యూల్‌ రూపొందించి, ప్రతి నెలా పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచించారు.

Polavaram Project Update
Polavaram Project Update

పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. మార్చి 2027 టార్గెట్..

ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. ఈ నెలాఖరుకు పోలవరం ఎడమ కాలువ నుంచి నీటి విడుదల..

అమరావతి: పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారు. ఎల్‌నినో, సూపర్‌ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పనులకు స్పష్టమైన షెడ్యూల్‌ రూపొందించి, ప్రతి నెలా పురోగతిపై నివేదిక ఇవ్వాలని సూచించారు.

అమరావతి సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పోలవరం, వెలిగొండ, ఐడీసీ లిఫ్ట్‌ పథకాలు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల, తాగునీటి ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వివరాలను వెల్లడించారు.

పోలవరం ప్రాజెక్టు సివిల్‌ పనులు ఇప్పటివరకు 90 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. భూసేకరణ 94 శాతం, ఆర్‌అండ్‌ఆర్‌ కింద నిర్వాసితుల తరలింపు 52 శాతం పూర్తయిందన్నారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు 77 శాతం పూర్తయినట్లు వెల్లడించారు.

మిగిలిన పనులను నిర్దేశిత షెడ్యూల్‌ ప్రకారం వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌, కాలనీల నిర్మాణం వంటి పనులను డిసెంబరు నాటికి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు.

వాస్తవానికి పోలవరం పూర్తి గడువు 2027 డిసెంబరు అని మంత్రి చెప్పారు. అయితే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని 2027 మార్చి నాటికే ప్రాజెక్టును పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని తెలిపారు.

ఇటీవల గోదావరికి 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలోనూ పోలవరం పనులు ఆగకుండా కొనసాగాయని మంత్రి చెప్పారు. పనుల వేగంపై సీఎం చంద్రబాబు అధికారులను అభినందించారని తెలిపారు.

ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌లో గ్యాప్‌-1 పనులు 48 శాతం, గ్యాప్‌-2 పనులు 36 శాతం పూర్తయ్యాయని వివరించారు. డిజైన్ల ప్రకారం 45.72 మీటర్ల స్థాయికి పనులు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. గండిపోచమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల మనోభావాలను గౌరవించేలా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు.

పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా భవిష్యత్తులో పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి చెప్పారు. సుమారు 10 వేల ఎకరాల పరిధిలో అభివృద్ధి అవకాశాలపై రేడియల్‌ సర్వే చేయనున్నట్లు తెలిపారు.

స్పిల్‌వే బ్యూటిఫికేషన్‌, ఐకానిక్‌ మోడల్‌లో కనెక్టివిటీ బ్రిడ్జి నిర్మాణం, హైవే కనెక్టివిటీ వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు రివర్‌ బేస్డ్‌ టూరిజాన్ని అభివృద్ధి చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులపై మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. 2019-24 మధ్య గత ప్రభుత్వం ఎల్‌ఎంసీ పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు రూ.1,500-1,800 కోట్లతో కీలక పనులు చేపట్టిందన్నారు. 11 చోట్ల జాతీయ రహదారుల క్రాసింగ్‌లతో పాటు పాంపా, తాండవ, ఏలేరు, వరాహ వంటి నదుల వద్ద క్లిష్టమైన పనులను పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నెలాఖరుకు పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని విడుదల చేసి అనకాపల్లి వరకు గోదావరి జలాలను తీసుకెళ్లే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని చెప్పారు.

విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్‌ సహా ఇతర డేటా సెంటర్లకు నీటి కొరత ఉండదని మంత్రి స్పష్టం చేశారు. వాటికి ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని, పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అందించేలా ప్రణాళిక ఉందన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు పనులను ఈ నెల 25 నాటికి కీలక దశకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. హెడ్‌ రెగ్యులేటర్లు, టన్నెల్‌ లైనింగ్‌, బెంచింగ్‌, ఫీడర్‌ కాలువ సీసీ వాల్‌, సీసీ లైనింగ్‌, నల్లమలసాగర్‌ రెగ్యులేటర్‌ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు.

టన్నెల్‌-2లో చిక్కుకున్న టీబీఎం యంత్రానికి సంబంధించి సుమారు 1,900 టన్నుల ఇనుములో 1,500 టన్నులు తొలగించామని, మిగిలిన 400 టన్నులను కూడా తొలగించే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అవసరమైతే గ్రానైట్‌, డైమండ్‌ కట్టింగ్‌ యంత్రాలను ఉపయోగించి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి షిఫ్టుల్లోనూ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

వెలిగొండ నిర్వాసితులకు గతంలో చెల్లించాల్సిన ఆర్‌అండ్‌ఆర్‌ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.318 కోట్లు విడుదల చేసిందని, మిగిలిన రూ.600 కోట్లను ఆగస్టు 17 నుంచి 24వ తేదీలోపు షెడ్యూల్‌ ప్రకారం చెల్లించాలని సీఎం నిర్ణయించారని తెలిపారు. నిర్వాసితుల చిన్నచిన్న సమస్యలను కూడా మానవతా దృక్పథంతో పరిష్కరించాలని సీఎం సూచించారని మంత్రి చెప్పారు.

హంద్రీనీవా, పోలవరం ఎల్‌ఎంసీ, వెలిగొండ వంటి ప్రాజెక్టులకు ఇప్పటికే షెడ్యూల్‌ రూపొందించి పనులు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇకపై రాష్ట్రంలోని 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఇరిగేషన్‌ క్యాలెండర్‌ రూపొందించాలని సీఎం ఆదేశించారని చెప్పారు.

ప్రతి ప్రాజెక్టుకు నెలవారీ లక్ష్యాలను నిర్దేశించి, ఆ నెలలో జరిగిన పనులపై వర్క్‌ ప్రోగ్రెస్‌ రిపోర్టును అందించాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో గతంలో 1,040 లిఫ్ట్‌ పథకాలు ఉండగా, వాటిలో పూర్తిస్థాయిలో పనిచేసేవి కేవలం 150 మాత్రమేనని మంత్రి తెలిపారు. ఈ లిఫ్ట్‌ల ద్వారా సుమారు 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేదని చెప్పారు.

లిఫ్ట్‌ పథకాలు నిర్వీర్యం కావడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఇప్పుడు వాటిని ప్రభుత్వమే మరమ్మతులు చేయించి, మరో 10 సంవత్సరాల పాటు నిర్వహణ బాధ్యత కూడా ప్రభుత్వమే చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎల్‌నినో, సూపర్‌ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న నీటిని 2027 జూన్‌ వరకు జాగ్రత్తగా వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా తాగునీటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిందన్నారు.

ప్రతి జిల్లాలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇరిగేషన్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. రైతులు, ప్రజలకు నీటి వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు.

తాగునీటి అవసరాలకు సరిపడా నీటిని ముందుగా కేటాయించి, మిగిలిన నీటిని మాత్రమే ఆరుతడి పంటలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. గోదావరి డెల్టాలో మాత్రం ఖరీఫ్‌ వరి సాగుకు నీటిని అందించనున్నట్లు స్పష్టం చేశారు.

Tags

Be the first to react

Latest