Nimmala Ramanaidu: అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్స్‌లో మంత్రి నిమ్మల.. వారం రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశం!
Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ఆయన అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్స్‌లోకి వెళ్లారు. దాదాపు నాలుగు గంటల పాటు టన్నెల్‌లోనే ఉండి పనులను పరిశీలించారు.
వెలిగొండ టన్నెల్స్ పనులపై మంత్రి నిమ్మల ఫోకస్.. 4 గంటల పాటు క్షేత్రస్థాయి పరిశీలన..
వెలిగొండలో టీబీఎం మెషిన్ వెలికితీత ప్రారంభం.. పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశం..
మార్కాపురం జిల్లా: వెలిగొండ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ఆయన అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్స్‌లోకి వెళ్లారు. దాదాపు నాలుగు గంటల పాటు టన్నెల్‌లోనే ఉండి పనులను పరిశీలించారు.
వెలిగొండ టన్నెల్స్‌లో టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషిన్)ను వెలికితీసే పనులను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. అనంతరం టన్నెల్‌లో జరుగుతున్న లైనింగ్ పనుల పురోగతిని అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
పనులు ఏ దశలో ఉన్నాయో, మిగిలిన పనులను ఎంత సమయంలో పూర్తి చేయగలరో మంత్రి వివరాలు తెలుసుకున్నారు. పనుల్లో జాప్యానికి ఎలాంటి అవకాశం ఇవ్వొద్దని అధికారులకు స్పష్టం చేశారు.
వెలిగొండ టన్నెల్ పనులను మరో వారంలోగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల అధికారులను, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా టన్నెల్‌లో దాదాపు నాలుగు గంటల పాటు ఉండి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడంపై ప్రభుత్వం చూపుతున్న ప్రాధాన్యతను మంత్రి స్పష్టం చేశారు.
వెలిగొండ ప్రాజెక్టులోని జంట సొరంగాల ద్వారా ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను విడుదల చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నల్లమల సాగర్‌లో కృష్ణా జలాలకు జలహారతి ఇవ్వనున్నారని చెప్పారు.
దీంతో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం కానుందని మంత్రి పేర్కొన్నారు. మూడు దశాబ్దాల చిరకాల కోరికను కూటమి ప్రభుత్వం నెరవేర్చబోతోందని ఆయన అన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు విషయంలో గత పాలకులు ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రాజెక్టును జాతికి అంకితం చేశామని చెప్పినా, వాస్తవంగా పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. వెలిగొండ పూర్తితో ఈ ప్రాంత రైతులకు సాగునీటి ప్రయోజనాలు అందడంతో పాటు ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు కారణంగా ప్రభావితమైన నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
వెలిగొండ జంట సొరంగాల పనులను త్వరగా పూర్తి చేసి ఈ నెలలోనే నల్లమల సాగర్‌కు కృష్ణా జలాలను చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు.
Tags
Be the first to react