AP Fire Department: ఏపీ అగ్నిమాపక శాఖకు ఆధునిక వాహనాలు.. రూ.40 కోట్లతో 58 ఫైర్‌ఫైటింగ్ వాహనాలు!
AP Fire Department: అగ్నిప్రమాదాలు, అత్యవసర పరిస్థితులను మరింత వేగంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖను ప్రభుత్వం ఆధునిక వాహనాలతో బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.40 కోట్లతో 58 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. అగ్నిమాపక శాఖలోకి 58 ఆధునిక వాహనాలు..
ఏపీ ఫైర్ సర్వీసెస్ ఆధునీకరణ.. 25 ఫైర్‌ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు..
అమరావతి: అగ్నిప్రమాదాలు, అత్యవసర పరిస్థితులను మరింత వేగంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖను ప్రభుత్వం ఆధునిక వాహనాలతో బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.40 కోట్లతో 58 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.
కొత్త వాహనాల రాకతో గ్రామీణ, అటవీ ప్రాంతాలతో పాటు నగరాల్లోని రద్దీ, ఇరుకైన ప్రాంతాల్లో కూడా అగ్నిమాపక సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఉంది.
కొత్తగా అందుబాటులోకి రానున్న 58 వాహనాల్లో మూడు రకాల వాహనాలు ఉన్నాయి. 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు, ఈ వాహనాలను అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వినియోగించనున్నారు.
గ్రామీణ ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సత్వరమే అక్కడికి చేరుకునేలా 25 అధునాతన ఫైర్‌ఫైటింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అగ్నిప్రమాదాలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో వీటి సేవలు కీలకంగా మారనున్నాయి.
పెద్ద స్థాయిలో అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు మంటలను అదుపు చేసేందుకు నిరంతరం నీరు అవసరం. ఈ అవసరాన్ని తీర్చేందుకు 20 వాటర్ బౌజర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బందికి నిరంతర నీటి సరఫరా అందించి, మంటలను అదుపు చేసే చర్యలను మరింత సమర్థంగా చేపట్టే అవకాశం ఉంటుంది.
నగరాలు, పట్టణాల్లోని ఇరుకైన రోడ్లు, రద్దీ ప్రాంతాల్లో సాధారణ ఫైర్ ఇంజిన్లు వేగంగా చేరుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ వాహనాలు ప్రమాద స్థలానికి వేగంగా చేరుకుని ప్రాథమికంగా మంటలను అదుపు చేసేందుకు ఉపయోగపడనున్నాయి. అగ్నిమాపక శాఖ ఆధునీకరణలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే తొలి దశలో రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇప్పుడు మరో 58 ఆధునిక వాహనాలు అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలో అగ్నిమాపక శాఖ సామర్థ్యం మరింత పెరగనుంది. అత్యవసర సమయాల్లో ప్రజలకు వేగంగా, మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.
Be the first to react