MSME: ఏపీ డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. PMFMEతో ఆహార శుద్ధి యూనిట్లకు అవకాశం!

MSME: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సొంతంగా ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా PMFME పథకాన్ని స్త్రీనిధితో అనుసంధానం చేసింది.

MSME
MSME

డ్వాక్రా మహిళలకు కొత్త అవకాశం.. స్త్రీనిధి రుణంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు..

ఏపీ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహం.. ఆహార శుద్ధి యూనిట్లకు అవకాశం..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సొంతంగా ఆహార శుద్ధి యూనిట్లు ఏర్పాటు చేసుకుని ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగేలా PMFME పథకాన్ని స్త్రీనిధితో అనుసంధానం చేసింది.

ఈ కొత్త అవకాశాన్ని అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు వినియోగించుకోవాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం అర్హత ఉన్న డ్వాక్రా మహిళలు రూ.3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం స్త్రీనిధి ద్వారా రుణ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో ఈ యూనిట్లకు PMFME పథకం కింద క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కూడా అందుతుంది. దీంతో గ్రామీణ మహిళలకు సొంత వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థికంగా మరింత వెసులుబాటు కలుగుతుంది.

ఈ పథకం ద్వారా మహిళలు తమ ప్రాంతాల్లో లభించే ముడి పదార్థాలతో పలు రకాల ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రధానంగా పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాల ఉత్పత్తులు, పప్పుల ప్రాసెసింగ్, మసాలా ఉత్పత్తులు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్, వంటి స్థానిక ఆహార ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను District Resource Organisations (DROs)గా పరిగణిస్తారు. వీటి ద్వారా ఆహార శుద్ధి రంగంలో ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించి పథకంలోకి ఎంపిక చేస్తారు. ఎంపికైన మహిళలకు కేవలం రుణం అందించడం మాత్రమే కాకుండా వ్యాపార నిర్వహణలో అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపికైన మహిళలకు ముడిసరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి అంశాల్లో ప్రభుత్వం సహకారం అందించనుంది.

వ్యాపారం ప్రారంభించిన తర్వాత కూడా మహిళలకు అవసరమైన తోడ్పాటు కొనసాగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మహిళలు రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించడం మాత్రమే కాకుండా, ఆ వ్యాపారం విజయవంతంగా నిలదొక్కుకునే వరకు ప్రభుత్వ సహకారం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

డ్వాక్రా మహిళలు ఉద్యోగం కోసం ఎదురుచూసే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడం ద్వారా వారి కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు స్థానికంగా కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి తెలిపారు.

అర్హత ఉన్న డ్వాక్రా మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వయం అభివృద్ధి సాధించాలని ఆయన కోరారు. తాము ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు చేరుకోవాలని ఆకాంక్షించారు.

PMFME–స్త్రీనిధి అనుసంధానం ద్వారా గ్రామీణ మహిళల చేతుల్లో వ్యాపార అవకాశాలు పెట్టడం, స్థానిక ఆహార ఉత్పత్తులకు విలువ జోడించడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

Tags

Be the first to react

Latest