Minister Narayana: రాజమహేంద్రవరంలో చెత్త నిర్వహణపై మంత్రి నారాయణ సమీక్ష.. అక్టోబర్ నాటికి 70 లక్షల టన్నుల వ్యర్థాలు తొలగింపు!
Minister Narayana: రాష్ట్రంలో చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసుతో కలిసి ఆయన లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను పరిశీలించారు.
ఏపీలో 107 మున్సిపాలిటీల్లో కొత్త వేస్ట్ ప్లాంట్లు.. మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి.. ఏపీలో 6 ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు..
రాజమహేంద్రవరం: రాష్ట్రంలో చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసుతో కలిసి ఆయన లెగసీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఘన వ్యర్థాల నిర్వహణ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుపై పలు కీలక విషయాలను వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 7,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం ప్రజలపై చెత్త పన్ను విధించినప్పటికీ, భారీగా చెత్తను అలాగే వదిలేసిందని విమర్శించారు.
భూమిపై పేరుకుపోయిన సుమారు 85 లక్షల టన్నుల చెత్తను ఇప్పటికే పూర్తిగా తొలగించామని మంత్రి చెప్పారు. మున్సిపాలిటీల్లో ప్రస్తుతం మిగిలి ఉన్న మరో 70 లక్షల టన్నుల చెత్తను అక్టోబర్ నాటికి పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు.
చెత్తను కేవలం తొలగించడం కాకుండా దానిని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి తెలిపారు. 2014–19 మధ్య రాష్ట్రంలో 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ, గత ముఖ్యమంత్రి అవగాహన లేక వాటిని రద్దు చేశారని నారాయణ ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయవాడ, పెద్దాపురం ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోందని తెలిపారు.
పెద్దాపురంలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పూర్తయిన తర్వాత రాజమహేంద్రవరం నుంచి వచ్చే చెత్తను అక్కడికి తరలించేలా ప్రణాళిక రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.
అప్పటి వరకు వ్యర్థాల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా రాష్ట్రంలోని 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని సెప్టెంబర్ నెలాఖరులోగా పూర్తి చేసి ఘన వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నారాయణ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారని మంత్రి తెలిపారు. విలీన గ్రామాలకు సంబంధించిన అంశంపై కోర్టు తీర్పు వెలువడిన తర్వాత మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నారాయణ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో చెత్త నిర్వహణను శాశ్వతంగా పరిష్కరించడంతో పాటు, వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే విధంగా మౌలిక వసతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
Tags
Be the first to react