Pawan Kalyan:త్రిప్రయార్ శ్రీరామస్వామి సన్నిధిలో పవన్ కళ్యాణ్.. దీపారాధనలో పాల్గొన్న డిప్యూటీ సీఎం!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళలోని ప్రసిద్ధ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఆయన ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన, మీనుట్టు, వేది వజిపాడు వంటి విశిష్ట సేవల్లో పాల్గొని భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
త్రిప్రయార్ శ్రీరామస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. ప్రత్యేక పూజలు, సేవల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి..
కేరళలో పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన.. త్రిప్రయార్ ఆలయంలో విశిష్ట సేవలు..
త్రిప్రయార్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేరళలోని ప్రసిద్ధ త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆలయానికి చేరుకున్న ఆయన ఆలయ సంప్రదాయాలను అనుసరిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపారాధన, మీనుట్టు, వేది వజిపాడు వంటి విశిష్ట సేవల్లో పాల్గొని భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
నాలాంబలం యాత్రలో ప్రముఖ క్షేత్రంగా, ప్రసిద్ధ శ్రీరామ క్షేత్రంగా పేరుగాంచిన త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్‌కు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. కొచ్చిన్ దేవస్థానం బోర్డు ఛైర్మన్, శ్రీరామస్వామి ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ కమిషనర్, ఆలయ అడ్మినిస్ట్రేటర్, అర్చక స్వాములు ఆయనకు స్వాగతం పలికారు.
దీపారాధనలో పాల్గొన్న పవన్ కళ్యాణ్
ఆలయంలో విశిష్ట సేవల్లో ఒకటిగా భావించే దీపారాధనలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఒక్క రోజు దీపారాధన సేవకు విరాళం అందించిన ఆయన స్వయంగా దీపాలు వెలిగించారు. ఆలయ ప్రధాన ద్వారం ఎదురుగా, శ్రీకృష్ణ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధాన దీపాల్లో జ్యోతి ప్రజ్వలన చేశారు.
దీపారాధనతో పాటు ఆలయ సంప్రదాయంలో భాగమైన మీనుట్టు, వేది వజిపాడు సేవల్లోనూ పాల్గొన్నారు. శంఖుచక్రాలతో పాటు ధనుస్సు, హారం ధరించిన శ్రీరామస్వామి వారి అద్భుత రూపాన్ని దర్శించుకుని సంధ్యాకాల అర్చనల్లో పాల్గొన్నారు.
శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామికి పట్టు వస్త్రాల సమర్పణ
శ్రీరామస్వామి దర్శనంతో పాటు ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణుడు, శ్రీ అయ్యప్పస్వామిని కూడా పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆయా దేవతామూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
అనంతరం గర్భాలయంలో మూలవిరాట్టుకు కుడివైపు ఉన్న దక్షిణామూర్తి, నైరుతి దిక్కున ఉన్న వినాయకుడు, అనంతపద్మనాభ స్వామి వారి శయన రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ మేల్ శాంతి (ప్రధాన అర్చకుడు) శ్రీ రామన్ తిరుమేని పవన్ కళ్యాణ్‌కు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
తీర్వా నదిలో చేపలకు ఆహారం
శ్రీరామస్వామి దర్శనానికి ముందు ఆలయ ప్రాంగణంలోని ఉత్తర దిక్కున ఉన్న శ్రీకృష్ణుడిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఆలయానికి ఆనుకుని ప్రవహించే తీర్వా నదిలో చేపలకు ఆహారం అందించే ‘మీనుట్టు’ సేవలో పాల్గొన్నారు.
త్రిప్రయార్ ఆలయ సంప్రదాయంలో చేపలకు ఆహారం అందించడం ప్రత్యేక ప్రాధాన్యం కలిగిన ఆచారం. మత్స్యావతార రూపంలో ఉన్న విష్ణుమూర్తికి స్వయంగా ఆహారం అందించినట్లుగా భక్తులు ఈ సేవను భావిస్తారు. భక్తి, సంప్రదాయం, ప్రకృతితో ముడిపడిన ఈ ఆచారంలో పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొనడం అక్కడి ప్రత్యేకతలను మరింతగా ప్రతిబింబించింది.
1,001 టపాసులకు విరాళం
శ్రీరామస్వామి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ ‘వేడి వజిపాడు’ సేవలో పాల్గొన్నారు. త్రిప్రయార్ ఆలయం తెరిచి ఉన్నంతసేపు బాణాసంచా పేల్చడం ఇక్కడి పురాతన సంప్రదాయాల్లో ఒకటిగా కొనసాగుతోంది.
పురాణ విశ్వాసాల ప్రకారం.. సీతాదేవి ఆచూకీ లభించిన విషయాన్ని ఆంజనేయస్వామి తన పొలికేక ద్వారా శ్రీరాముడికి తెలియజేయగా, శ్రీరామస్వామి బాణాసంచా పేల్చడం ద్వారా స్పందించారని చెబుతారు. ఈ విశ్వాసానికి ప్రతీకగా త్రిప్రయార్ ఆలయంలో ‘వేడి వజిపాడు’ సేవను నిర్వహిస్తున్నారు. ఈ సేవలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ 1,001 టపాసులు పేల్చేందుకు అయ్యే మొత్తాన్ని విరాళంగా సమర్పించారు.
అయ్యప్పస్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు
ఆలయంలోని ఇతర పూజా కార్యక్రమాలను పూర్తి చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ భక్తులు ‘శాస్తా’గా కొలిచే అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయానికి పురాణ, చారిత్రక ప్రాధాన్యం ఉంది. ఇక్కడి శ్రీరామస్వామి విగ్రహాన్ని ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి.
ద్వారకానగరం సముద్రగర్భంలో కలిసిపోయిన అనంతరం శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల విగ్రహాలు కేరళ తీరానికి కొట్టుకువచ్చినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. వాటిలో శ్రీరామస్వామి విగ్రహం త్రిప్రయార్‌లో ప్రతిష్ఠితమైందని భక్తుల విశ్వాసం.
నాలాంబలం యాత్రలోని ప్రముఖ క్షేత్రాల్లో త్రిప్రయార్‌కు ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరామస్వామి, శ్రీకృష్ణుడు, అయ్యప్పస్వామి తదితర దేవతామూర్తులతో ఈ ఆలయ ప్రాంగణం ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం సంతరించుకుంది.
కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కేరళలోని ఒక ప్రాంతంలో ఆయుర్వేద వైద్యం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం త్రిప్రయార్ శ్రీరామస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారి సేవల్లో పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ సేవల్లో పాల్గొంటూ, పలు దేవతామూర్తులకు పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Be the first to react