⚡ BREAKING

TDP: ప్రభుత్వ భూముల కబ్జా నుంచి రియల్ ఎస్టేట్ మోసాల వరకు.. టీడీపీ ప్రజావినతుల్లో వెల్లువెత్తిన ఫిర్యాదులు!

TDP: ప్రభుత్వ భూముల కబ్జా, భూ రికార్డుల తారుమారు, రీసర్వేలో అవకతవకలు, వారసత్వ భూముల ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మోసాలు వంటి సమస్యలపై పలువురు బాధితులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీలు సమర్పించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, ఉన్నతస్థాయిలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Praja Vedika
Praja Vedika

రూ.24 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు.. రికార్డులు తారుమారు చేశారంటూ మరో అర్జీ..

రీసర్వేలో అవకతవకలు, భూహద్దుల వివాదాలు, ఇళ్ల ఆక్రమణలపై బాధితుల వినతి..

అమరావతి: ప్రభుత్వ భూముల కబ్జా, భూ రికార్డుల తారుమారు, రీసర్వేలో అవకతవకలు, వారసత్వ భూముల ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మోసాలు వంటి సమస్యలపై పలువురు బాధితులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీలు సమర్పించారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, ఉన్నతస్థాయిలో జోక్యం చేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరారు.

ఏపీ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ పొలంరెడ్డి దినేష్ రెడ్డికి పలువురు తమ సమస్యలను వివరించారు. భూ వివాదాలతో పాటు పింఛన్లు, రేషన్, ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాలు, వైద్య, ఆర్థిక సహాయం వంటి అంశాలపైనా ప్రజలు వినతులు అందించారు.

రూ.24 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాపై ఫిర్యాదు
వైఎస్సార్ కడప జిల్లా మడకలవారిపల్లి గ్రామానికి చెందిన బి. నారాయణ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఆంజనేయులు తమ గ్రామంలోని సర్వే నంబర్ 977/3లో ఉన్న 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఫిర్యాదు చేశారు. తమ అంచనా ప్రకారం ఈ భూమి విలువ సుమారు రూ.24 కోట్లు ఉంటుందని తెలిపారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నారని వారు ఆరోపించారు. గతంలో ఈ భూమిపై నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఆక్రమణలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయి రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ భూమిని రక్షించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు దినేష్ రెడ్డిని కోరారు.

90 ఏళ్ల నాటి వారసత్వ భూమిపై రికార్డులు మార్చారంటూ అర్జీ
కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామానికి చెందిన నెక్కలపూడి సుబ్బలక్ష్మి మరో భూ వివాదంపై ఫిర్యాదు చేశారు. బాపులపాడు మండలం వీరవల్లి పరిధిలోని సర్వే నంబర్ 256/16లో 76 సెంట్లు, సర్వే నంబర్లు 256/15, 19 సబ్ డివిజన్లలో కలిపి మొత్తం సుమారు ఎకరం 49 సెంట్ల భూమి తమ కుటుంబానికి చెందినదని తెలిపారు.

దాదాపు 90 ఏళ్ల క్రితం తన తాత ఆలపాటి వెంకయ్య నుంచి తన తండ్రి ఆలపాటి రాఘవయ్యకు ఈ భూమి వాటాగా వచ్చిందని వివరించారు. 2012లో భూమిపై ఆక్రమణలు జరగడంతో అప్పటి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా, రెవెన్యూ అధికారులు దానిని ‘బీడు భూమి’గా పేర్కొంటూ నివేదిక ఇచ్చారని తెలిపారు.

తమ బాబాయి విక్రయించిన భూమికి సంబంధించి తమ వాటాగా వచ్చిన 76 సెంట్ల భూమి రికార్డులను కూడా రెవెన్యూ అధికారులు తారుమారు చేసి ఆళ్ల వెంకటేశ్వరరావుకు అనుకూలంగా మార్చారని ఆమె ఆరోపించారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, రికార్డులను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.

రీసర్వే పేరుతో ఎకరం భూమిని కాజేసే ప్రయత్నం
విజయనగరం జిల్లా వంగర మండలం నీలయ్యవలస గ్రామానికి చెందిన వంజరాపు నారాయణ స్వామి తన భూమికి సంబంధించిన సమస్యను వివరించారు. సర్వే నంబర్ 176లో ఉన్న తన భూమిపై రీసర్వే సమయంలో సర్వేయర్ తప్పుడు ఎల్పీ మ్యాప్ రూపొందించి ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.

స్థానిక వీఆర్వో సహకారంతో తన సోదరుడి అల్లుడు బెజ్జిపురం రవిబాబు ఎకరం భూమికి సంబంధించి అక్రమంగా 1-బీ సృష్టించుకున్నారని తెలిపారు. భూమి వద్ద సర్వే రాళ్లు వేయడానికి ప్రయత్నించిన సమయంలో అడ్డుకున్నారని, రెవెన్యూ సదస్సులో కొత్త 1-బీ కోసం దరఖాస్తు చేయకుండా తన సోదరుడు, అతని అల్లుడు భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. తన తల్లిని దూషించారని కూడా ఆరోపించారు.

చనిపోయిన మేనమామ భూమి ఇప్పటికే ఆయన కుమార్తె పేరిట నమోదై ఉన్నప్పటికీ, రీసర్వేను ఆసరాగా చేసుకుని తమ తల్లిదండ్రుల ఆస్తిని మేనమామ భూమిగా చూపిస్తూ రిజిస్టర్డ్ వీలునామా పేరుతో మోసం చేస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు.

పీజీఆర్‌ఎస్ ద్వారా పలుమార్లు ఫిర్యాదులు చేసినా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా సుమారు 150 రోజుల తర్వాత పాత ఎండార్స్‌మెంట్‌నే మళ్లీ జారీ చేశారని తెలిపారు. ఇప్పటివరకు ఎంఆర్వో, ఆర్డీవో స్థాయిలో ఎనిమిది సార్లు వాస్తవాలకు విరుద్ధమైన నివేదికలు ఇచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

భూహద్దు గట్లు తొలగించి ఆక్రమించుకున్నారంటూ ఫిర్యాదు 
బాపట్ల జిల్లా చినగంజాం మండలం పెదగంజాం గ్రామానికి చెందిన బీబీజాన్ తన వ్యవసాయ భూమి సమస్యపై అర్జీ ఇచ్చారు. సర్వే నంబర్ 448-3 పరిధిలో 1.57 సెంట్ల వ్యవసాయ భూమి తమ కుటుంబానికి గత వందేళ్లుగా పూర్వీకుల ఆస్తిగా వస్తోందని తెలిపారు.

తమ పొలం పక్కనే ఉన్న గడ్డం శ్రీను, గడ్డం రాములు, కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు కలిసి భూమి సరిహద్దు గట్లను తొలగించి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. తమ భూమికి హద్దులు నిర్ణయించి ఆక్రమణను తొలగించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పొన్నూరులో రియల్ ఎస్టేట్ లావాదేవీపై రూ.14 లక్షలకు పైగా చెల్లింపు 
గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రుక్మాంగద రియల్ ఎస్టేట్ లావాదేవీపై ఫిర్యాదు చేశారు. మాచవరం సమీపంలోని ములుకుదురు రోడ్డులో ఉన్న రియల్ ఎస్టేట్ లేఅవుట్‌లో 2004 నంబర్ ప్లాట్ కొనుగోలు కోసం కొమ్మినేని ప్రభు వేంకటేశ్వరరావుకు మొదట రూ.11.20 లక్షలు చెల్లించినట్లు తెలిపారు.

అనంతరం 2025 మే 1 నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా పొన్నూరు శాఖ ద్వారా వాయిదాల రూపంలో మరో రూ.2,75,556 చెల్లించినట్లు వివరించారు. ప్లాట్‌ను త్వరలోనే స్వాధీనం చేస్తామని, అప్పటివరకు అద్దె చెల్లిస్తామని నిర్వాహకులు హామీ ఇచ్చారని తెలిపారు.

అయితే దాదాపు 20 నెలలుగా హామీ నెరవేర్చకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, తనకు రావాల్సిన ప్లాట్ లేదా చెల్లించిన మొత్తానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కోరారు.

రూ.50 లక్షలు ఇస్తేనే ఇల్లు ఖాళీ చేస్తామంటూ బెదిరింపులు 
కడపకు చెందిన మల్లెం నిరంజన్ రెడ్డి, మల్లెం సాయిసౌమ్య, సిద్దవటం జయదీప్ రెడ్డి తమ ఆస్తి విషయంలో ఫిర్యాదు చేశారు. నగర శివారులోని ఎర్రముక్కపల్లె పూసల వీధిలో సర్వే నంబర్ 84/1లో 0.09 సెంట్ల ఖాళీ స్థలంతో పాటు పెంకుటిల్లు ఉందని తెలిపారు.

ఈ ఆస్తిని 2013లో తిరుపతికి చెందిన ముద్దా వెంకటసుబ్బారెడ్డి అప్పటి యజమానులు సట్టి భార్గవి, సట్టి భాస్కర్, సట్టి లక్ష్మిపతి నుంచి డాక్యుమెంట్ నంబర్ 167/2013 ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అనంతరం ముద్దా వెంకటసుబ్బారెడ్డి నుంచి తాము సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో 2270, 2271, 2272 డాక్యుమెంట్ నంబర్లతో ఆ స్థలం, ఇంటిని కొనుగోలు చేశామని తెలిపారు.

అయితే కొనుగోలు చేసి ఏడాదిన్నర దాటినా పాత యజమానులు ఇంటిని ఖాళీ చేయడం లేదని ఆరోపించారు. ముద్దా వెంకటసుబ్బారెడ్డి కొనుగోలు చేసి 13 ఏళ్లు గడిచినా పాత యజమానులు ఆ ఇంటిని తమ ఆధీనంలోనే ఉంచుకున్నారని తెలిపారు.

ఇల్లు ఖాళీ చేయాలని కోరితే రూ.50 లక్షలు ఇస్తేనే ఖాళీ చేస్తామని, లేకపోతే చేయబోమంటూ బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుని తమ ఆస్తిని తమకు అప్పగించేలా చూడాలని కోరారు.

పట్టా స్థలంలో రోడ్డు నిర్మాణం.. గోడ కడుతుంటే కూల్చివేత
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విరాట్ నగర్ బీసీ కాలనీకి చెందిన అన్నపూర్ణమ్మ కూడా భూ ఆక్రమణపై ఫిర్యాదు చేశారు. సుమారు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం తమ బంధువులకు మూడు సెంట్ల పట్టా భూమిని మంజూరు చేసిందని తెలిపారు.

వారు అనారోగ్యంతో మరణించిన తర్వాత తమ అత్తగారు ఆర్థిక అవసరాల కోసం స్థలానికి సంబంధించిన పత్రాలను తనకు అప్పగించారని వివరించారు. అప్పటి నుంచి ఆ స్థలంలో రెండు గదుల ఇల్లు నిర్మించుకుని పంచాయతీకి క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు.

తాము ఇంట్లో లేని సమయంలో పొరుగువారైన ఏలూరి జయప్రకాష్, తుర్లపాటి చిన భోగలింగాచారి తదితరులు కలిసి సుమారు సెంటున్నర స్థలాన్ని ఆక్రమించి తమకు నచ్చిన విధంగా రోడ్డు వేశారని ఆరోపించారు.

2025లో పీజీఆర్‌ఎస్ ద్వారా పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని తెలిపారు. మండల, జిల్లా సర్వేయర్లు క్షేత్రస్థాయికి వచ్చినప్పటికీ ఆక్రమణదారులు వేసిన 12 అడుగులకు పైగా ఉన్న రోడ్డును స్థలంలోనే కలిపి తప్పుడు కొలతలతో ఎండార్స్‌మెంట్ ఇచ్చారని ఆరోపించారు.

కమ్యూనిటీ స్థల పత్రాలు, పక్క ఇళ్ల పట్టాలు, అసలైన లేఅవుట్ మ్యాప్‌ను పరిశీలించి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా కింది స్థాయి అధికారులు కాలయాపన చేస్తున్నారని తెలిపారు. అధికారుల వద్ద ఉన్న మ్యాప్‌లకు, క్షేత్రస్థాయిలో ఉన్న హద్దులు, రోడ్డు కొలతలకు పొంతన లేదని పేర్కొన్నారు.

దీంతో సెప్టెంబర్ 4న తమ పట్టా హద్దుల ప్రకారం మూడు వరుసల రాళ్లతో ప్రహరీ గోడ నిర్మించేందుకు ప్రయత్నించామని తెలిపారు. అయితే పొరుగువాడైన తుర్లపాటి శ్రీనివాసరావు (బాలు) తన అనుచరులతో వచ్చి అధికారుల సమక్షం లేకుండానే గోడను కూల్చివేశారని ఆరోపించారు. మళ్లీ గోడ కడితే ఇల్లు కూడా కూల్చేస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుని తమ భూమికి రక్షణ కల్పించాలని కోరారు.

పూర్వీకుల ఆస్తిపై తప్పుడు క్లెయిమ్‌లు 
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ముక్కామల గ్రామానికి చెందిన జయ విశ్వనాథ్ తమ పూర్వీకుల రిజిస్టర్డ్ ఆస్తికి సంబంధించిన వివాదంపై అర్జీ ఇచ్చారు.

కొంతమంది తప్పుడు క్లెయిమ్‌లు చేస్తున్నారని, పంచాయతీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ధ్రువీకరణ పత్రం జారీ చేశారని ఆరోపించారు. ఆ పత్రంపై ఉన్న పంచాయతీ కార్యదర్శి సంతకం కూడా అనుమానాలకు తావిస్తోందని తెలిపారు.

ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లినా విచారణ జరగలేదని పేర్కొన్నారు. ఎంపీడీవో, ఎమ్మార్వోలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదని, సంబంధిత అంశంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.

ఎనిమిదేళ్లుగా ఆస్తుల కోసం పోరాటం 
బాపట్ల జిల్లా పేరలి గ్రామానికి చెందిన ఏపూరి విజయవాణి కూడా తన ఆస్తులను తిరిగి ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. 2016 అక్టోబర్ 23 రాత్రి గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి కొందరు తమపై దౌర్జన్యానికి పాల్పడి వ్యవసాయ పొలం, రెండు నివాస గృహాలను అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించారు.

ఏపూరి బాపతిరావు, జాలది సుబ్బారావు, జాలది మస్తాన్ తదితరులు తమ స్థలాలు, ఇళ్లను ఆక్రమించుకున్నారని ఆమె పేర్కొన్నారు. అప్పటి నుంచి న్యాయం కోసం స్థానిక అధికారులను ఆశ్రయిస్తున్నా ఇప్పటివరకు పరిష్కారం కాలేదని తెలిపారు. తమ ఆస్తులను తిరిగి ఇప్పించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

పింఛన్లు, రేషన్, ఇళ్ల నిర్మాణంపైనా వినతులు 
భూ సమస్యలతో పాటు ప్రజావినతుల కార్యక్రమంలో పలువురు తమ పింఛన్, రేషన్ కార్డులు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వీటిని పరిష్కరించాలని కోరుతూ అర్జీలు సమర్పించారు.

మరికొందరు ఉద్యోగ అవకాశాల కోసం తమ రెస్యూమ్‌లను అందజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, చికిత్స కోసం ఆర్థిక సహాయం అందించాలని మరికొందరు విజ్ఞప్తి చేశారు.

వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజావినతుల కార్యక్రమంలో వివరించారు. భూమి, ఆస్తి వివాదాల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులకు త్వరితగతిన పరిష్కారం లభించాలని, సంబంధిత శాఖల అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.

Tags

Be the first to react

Latest