దేశంలోనే తొలిసారి స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్.. ముంబై IFATలో ఏపీ ఘనత!
Swachh Andhra Awards: పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ వేదికపై ప్రత్యేకంగా నిలిచాయి. ముంబైలోని గోరేగావ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఫర్ వేస్ట్ వాటర్ టెక్నాలజీ (ఐ-ఫ్యాట్/IFAT)లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తరఫున ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ ప్రారంభించిన తొలి రాష్ట్రం ఏపీ: కొమ్మారెడ్డి పట్టాభిరామ్..
ముంబై IFATలో ఏపీ పారిశుద్ధ్య కార్యక్రమాల ప్రదర్శన.. స్వచ్ఛ ఆంధ్రపై ప్రత్యేక ఫోకస్..
ముంబై: పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ వేదికపై ప్రత్యేకంగా నిలిచాయి. ముంబైలోని గోరేగావ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ ఫర్ వేస్ట్ వాటర్ టెక్నాలజీ (ఐ-ఫ్యాట్/IFAT)లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తరఫున ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ శుక్రవారం ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే తొలిసారిగా ‘స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్’ను ప్రారంభించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని తెలిపారు. రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.
30 దేశాల నుంచి 600కుపైగా కంపెనీలు
ముంబైలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ ప్రదర్శనలో పర్యావరణం, నీటి నిర్వహణ, వ్యర్థాల శుద్ధి, రీసైక్లింగ్‌కు సంబంధించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. సురక్షితమైన తాగునీటి సరఫరా, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే సాంకేతికత, మురుగునీటి నిర్వహణ, వర్షపు నీటి సంరక్షణ, ఘన వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి అంశాలు ప్రధానంగా ప్రదర్శనలో ఉన్నాయి.
సుమారు 30 దేశాల నుంచి 600కుపైగా కంపెనీలు ఈ ఎగ్జిబిషన్‌లో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. నగరాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్, ఈ-వ్యర్థాల రీసైక్లింగ్, వ్యర్థాల నుంచి విద్యుత్ లేదా ఇంధనం తయారీ, పరిశ్రమల నుంచి వెలువడే పొగ, వాయు కాలుష్యాన్ని తగ్గించే ఎయిర్ స్క్రబ్బర్లు, గాలి నాణ్యతను పర్యవేక్షించే పరికరాలు సహా 6 వేలకు పైగా పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
పర్యావరణ ఇంజినీర్లు, మున్సిపల్ అధికారులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు ఈ వేదికపై చర్చల్లో పాల్గొంటూ కొత్త గ్రీన్ టెక్నాలజీలపై తమ అనుభవాలను పంచుకుంటున్నారు.
రాష్ట్రానికి ఉపయోగపడే టెక్నాలజీలపై పట్టాభిరామ్ పరిశీలన
ఎగ్జిబిషన్‌లోని వివిధ స్టాళ్లను సందర్శించిన చైర్మన్ పట్టాభిరామ్ ఆధునిక యంత్రాలు, పరికరాలను పరిశీలించారు. వాటి పనితీరు, వినియోగం, వ్యర్థాల నిర్వహణలో వాటి ప్రయోజనాలను స్టాళ్ల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాలు, స్థానిక సంస్థలకు ఉపయోగపడే సాంకేతికత ఏదనే అంశంపై ప్రత్యేకంగా వివరాలు సేకరించారు.
రాష్ట్రంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చేందుకు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలకు ప్రత్యేక స్టాల్
ఐ-ఫ్యాట్ ఎగ్జిబిషన్‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తరఫున ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ (ఏఎల్ఎల్ఎస్‌జీ) ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పలు ప్రతిష్టాత్మక పారిశుద్ధ్య కార్యక్రమాలను ఈ స్టాల్‌లో ప్రదర్శిస్తున్నారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర, ఆపరేషన్ క్లీన్ స్వీప్, స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్, వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లు, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు, సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి.
అలాగే ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంచేందుకు చేపడుతున్న ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తున్నారు.
అంతర్జాతీయ వేదికపై ఏపీ పారిశుద్ధ్య నమూనా
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాల అమలులో ఏఎల్ఎల్ఎస్‌జీ భాగస్వామిగా వ్యవహరిస్తోందని పట్టాభిరామ్ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి వేదికపై రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు, సాధించిన ఫలితాలు, ఉత్తమ విధానాలను ప్రదర్శించడంలో సంస్థ కీలకంగా సహకరిస్తోందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, దేశంలోనే తొలిసారిగా స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో మంచి పనితీరు కనబరిచే స్థానిక సంస్థలు, ఇతర భాగస్వాములను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ఉద్దేశమని వివరించారు.
స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలకు అనుగుణంగా అడుగులు
ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న కొత్త సాంకేతికతలను పరిశీలించి, వాటిని ఆంధ్రప్రదేశ్‌లో ఎలా వినియోగించుకోవచ్చనే అంశంపై దృష్టి సారిస్తున్నామని పట్టాభిరామ్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బి. సునీల్ కుమార్ రెడ్డి కూడా ఎగ్జిబిషన్‌ను సందర్శించి ఆధునిక సాంకేతికతను పరిశీలించినట్లు తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులకు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిచయం చేసేందుకు ఈ ఎగ్జిబిషన్ ఒక మంచి అవకాశంగా నిలిచిందని పట్టాభిరామ్ అన్నారు.
స్వర్ణాంధ్ర @ 2047 లక్ష్యాలను సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ స్పష్టమైన దార్శనికత, వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పారు. రాష్ట్రం నుంచి ప్రదర్శించిన కార్యక్రమాలు, విధానాలపై ఎగ్జిబిషన్‌కు వచ్చిన సాంకేతిక సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు, పర్యావరణ నిర్వహణ నిపుణులు, ఇతర భాగస్వాముల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన వెల్లడించారు.
పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణను కేవలం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఉద్యమంగా మార్చేందుకు ఇలాంటి వేదికలు మరింత ఉపయోగపడతాయని అధికారులు పేర్కొన్నారు.
Tags
Be the first to react