Chandrababu: సంక్షేమం కోసం కుటుంబాలు విడిపోవద్దు! సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
Welfare Policies AP: సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోకుండా విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలు ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేలా ఉండాలి: సీఎం చంద్రబాబు..
కుటుంబాన్నే ప్రాథమిక యూనిట్‌గా తీసుకోవాలి.. సంక్షేమ క్యాలెండర్ రూపొందించాలి..
అమరావతి: సంక్షేమ పథకాల ప్రయోజనాల కోసం ఉమ్మడి కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోకుండా విధానాలను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ఆర్థిక అసమానతలను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు.
కలెక్టర్ల సదస్సు రెండో, చివరి రోజు నిర్వహించిన సమావేశంలో సీఎం పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుటుంబాన్ని ప్రాథమిక యూనిట్‌గా పరిగణించి రేషన్ వంటి సంక్షేమ ప్రయోజనాలను కుటుంబంలోని అందరికీ అందేలా విధానాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు.
కొత్త పింఛన్లు మంజూరు చేసే ముందు కుటుంబ యూనిట్ మ్యాపింగ్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు ఎలాంటి మార్పులు చేయకుండా కొనసాగించాలని స్పష్టం చేశారు.
సంక్షేమ పథకాలకు ప్రత్యేక క్యాలెండర్
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు సకాలంలో అందేలా ప్రత్యేక సంక్షేమ క్యాలెండర్ రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఏ పథకానికి సంబంధించిన ప్రయోజనం ఎప్పుడు అందుతుందో ప్రజలకు ముందుగానే తెలిసేలా క్యాలెండర్ ఉండాలని సూచించారు.
సంక్షేమ పథకాల ద్వారా అందుతున్న ప్రయోజనాలను ప్రజలు మరింత మెరుగ్గా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. ఇప్పటివరకు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలపై సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసిందని సీఎం తెలిపారు. ఇందులో ఒక్క పింఛన్లకే సుమారు రూ.75 వేల కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.
సంక్షేమ విధానాలు కేవలం ఆర్థిక సహాయం అందించడానికే పరిమితం కాకూడదని చంద్రబాబు అన్నారు. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచేలా ఉండాలని చెప్పారు. కుటుంబాలను మరింత ఆర్థికంగా బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.
ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి
ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా ‘వన్ ఫ్యామిలీ–వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి SERP, MEPMA అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఐదు లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని సూచించారు. అదే సమయంలో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.
పీ4ను ప్రజా ఉద్యమంగా మార్చాలి
‘పీ4’ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో పీ4ను మరింత విస్తృతంగా అమలు చేయాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.
ప్రజలను ఆర్థికంగా సాధికారులను చేయడం, కుటుంబాల ఆదాయాన్ని పెంచడం, మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం వంటి లక్ష్యాలతో కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.
ప్రతి నెలా ఒక కార్యక్రమం.. ప్రజలకు మరింత చేరువగా పాలన
ప్రజలకు సంక్షేమం, భూమి హక్కులు, పారిశుధ్యం, ఆరోగ్యం వంటి అంశాలపై నిరంతరం సేవలు అందించేలా నెలవారీ కార్యక్రమాలను నిర్వహించాలని సీఎం తెలిపారు. ప్రతి నెలా మొదటి తేదీని ‘పేదల సేవలో’ కార్యక్రమానికి కేటాయించినట్లు చెప్పారు. ఆ రోజున సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ప్రతి నెల 9వ తేదీన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా భూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి, ప్రక్షాళన చేయాలని సూచించారు.
ప్రతి నెల మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమం ద్వారా పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నాలుగో శనివారం ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డుల కార్యక్రమాన్ని అమలు చేసి ప్రజల ఆరోగ్య నిర్వహణను మెరుగుపరచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమాలతో పాటు సానుకూల ఆలోచనా విధానం, విలువలతో కూడిన సమాజ నిర్మాణం గురించి కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని చంద్రబాబు సూచించారు.
నెల రోజుల్లో ఆన్‌లైన్‌లోనే ఫైళ్ల క్లియరెన్స్
ప్రభుత్వ ఫైళ్ల పరిష్కారంపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, ఇతర అధికారులు ఫైళ్లను నిర్ణీత సమయంలో పరిష్కరించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇకపై మొత్తం ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ఆదేశించారు. ఒక నెల తర్వాత మాన్యువల్‌గా ఫైళ్లను పరిష్కరించే విధానం ఉండకూడదని స్పష్టం చేశారు.
రెండు రోజుల్లోపు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లను పరిష్కరిస్తున్న అధికారులను సీఎం అభినందించారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పరిపాలన మరింత సమర్థంగా సాగుతుందని చెప్పారు.
కలెక్టర్లు, కార్యదర్శుల క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి
కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాన్ని తెలుసుకున్నప్పుడే అధికారుల పనితీరు మరింత మెరుగుపడుతుందని చెప్పారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సేవలపై వారి అభిప్రాయాలను అధికారులు స్వయంగా తెలుసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి వాస్తవాలను తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పాలనను మరింత ప్రజలకు చేరువ చేయవచ్చని సీఎం పేర్కొన్నారు.
గైర్హాజరైన అధికారులపై సీఎం ఆగ్రహం
కలెక్టర్ల కాన్ఫరెన్సుకు కొంతమంది శాఖాధిపతులు హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కీలకమైన సమావేశానికి గైర్హాజరైన అధికారుల నుంచి వివరణ కోరాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
జిల్లాల పాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకునే కలెక్టర్ల సమావేశానికి శాఖాధిపతులు బాధ్యతగా హాజరు కావాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రజలకు సంక్షేమ ప్రయోజనాలు సకాలంలో అందించడం, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజా ఉద్యమాలుగా మార్చడం, టెక్నాలజీ ఆధారిత పాలనను వేగవంతం చేయడం లక్ష్యంగా అధికారులు పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్ తీసుకుని పాలనలో అవసరమైన మార్పులు చేయాలని స్పష్టం చేశారు.
Be the first to react