Chandrababu: ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి.. ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు!
Chandrababu: ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యకు రియల్ టైమ్లో స్పందించి, వేగంగా పరిష్కారం అందించాలంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఐదు రోజుల జిల్లా పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న ఆయన సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్)లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
పట్టణ ప్రాంతాల్లో జీరో వేస్ట్ లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ..
24 గంటలూ ప్రజలకు సేవలు అందించాలి.. ఆర్టీజీఎస్కు సీఎం దిశానిర్దేశం..
అమరావతి: ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యకు రియల్ టైమ్లో స్పందించి, వేగంగా పరిష్కారం అందించాలంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఐదు రోజుల జిల్లా పర్యటన అనంతరం అమరావతికి చేరుకున్న ఆయన సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ (ఆర్టీజీఎస్)లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల పనితీరును ఈ సందర్భంగా పరిశీలించారు.
ప్రజల సమస్యలపై 24 గంటలూ స్పందించే విధంగా ఆర్టీజీఎస్ వ్యవస్థ పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇటీవల విశాఖ సముద్ర తీరంలో బోటు ప్రమాదం జరిగిన సమయంలో వివిధ శాఖలు ఎంత వేగంగా స్పందించాయనే అంశాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమని చెప్పారు. సీఎస్ ఆధ్వర్యంలో అన్ని శాఖల మధ్య తరచూ సమన్వయ సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఏఐ సాంకేతికతతో చిత్తూరు జిల్లాలో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేస్తున్నామని పేర్కొన్న సీఎం, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవచ్చన్నారు. నియోజకవర్గ స్థాయిలో చివరి వ్యక్తికి ప్రభుత్వ సేవలు చేరేలా 'లాస్ట్ మైల్ గవర్నెన్స్'పై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే మెరుగైన పాలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్)లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. శాఖల వారీగా, సమస్యల వారీగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పెండింగ్ ఫిర్యాదులను తగ్గించాలని సూచించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక బాధ్యత తీసుకుని క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని సీఎం సూచించారు. మహిళలపై నేరాలను గణనీయంగా తగ్గించడంతో పాటు గంజాయి ముఠాలను పూర్తిగా అణచివేయాలని ఆదేశించారు. డ్రగ్స్ నిర్మూలనపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'డ్రగ్ ఫ్రీ ఇండియా' లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం కూడా ముందుకు సాగాలని చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలితాలను ఎప్పటికప్పుడు విశ్లేషించాలని అధికారులకు సూచించిన సీఎం, తాగునీటి సరఫరా, ఇంటింటికీ చెత్త సేకరణ, స్వచ్ఛ రథాల నిర్వహణ వంటి అంశాలకు స్పష్టమైన ప్రమాణాలు (ఎస్ఓపీ) రూపొందించాలని చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకుపోయిన 23 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను మూడు నెలల్లో పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలను 'జీరో వేస్ట్'గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఆర్థిక, ఆర్థికేతర విభాగాలుగా వర్గీకరించి వేగంగా పరిష్కరించాలని సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి అవసరమైతే రాష్ట్రంలో అమలు చేయాలని, ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. 'అవేర్ 2.0' కార్యక్రమం ద్వారా వచ్చిన ఫలితాలపై నెల రోజుల్లో సమగ్ర విశ్లేషణ చేయాలని అధికారులను ఆదేశించారు.
మారుమూల ప్రాంతాల్లో కూడా మొబైల్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావడానికి కొత్త కమ్యూనికేషన్ టవర్లు ఏర్పాటు చేయాలని, టెలికాం సంస్థలతో చర్చించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి, ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పురపాలక, ఎక్సైజ్, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Be the first to react