Minister Savitha: ఆప్కో స్వర్ణోత్సవం.. నేతన్నలకు భారీ వరాలు ప్రకటించిన మంత్రి సవిత!
Minister Savitha: మంగళగిరిలో ఆప్కో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత నేతన్నలకు అనేక కీలక ప్రకటనలు చేశారు. చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని, ఆప్కోకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఆమె స్పష్టం చేశారు.
త్వరలో ‘నేతన్న భరోసా’ పథకం: చేనేత రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం..
చేనేత సంఘాలకు రూ.6.50 కోట్ల బకాయిల చెల్లింపు: మంత్రి సవిత..
మంగళగిరిలో ఆప్కో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత నేతన్నలకు అనేక కీలక ప్రకటనలు చేశారు. చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని, ఆప్కోకు పూర్వ వైభవం తీసుకువస్తామని ఆమె స్పష్టం చేశారు.
ఆప్కో స్వర్ణోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, తాను చేనేత శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ స్వర్ణోత్సవాలు జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేశ్ గారి మార్గదర్శకంలో రాష్ట్ర చేనేత రంగం మళ్లీ అభివృద్ధి దిశగా సాగుతోందన్నారు. నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లను చేనేత రంగానికి “బ్రాండ్ అంబాసిడర్లు”గా అభివర్ణించారు.
త్వరలోనే ‘నేతన్న భరోసా’ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. చేనేత సహకార సంఘాలకు ఆప్కో బకాయిలు చెల్లించనున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.6.50 కోట్ల బకాయిల్లో భాగంగా ఈ నెల 15న రూ.4 కోట్లు, వచ్చే నెల మొదటి వారంలో మరో రూ.2.50 కోట్లు చెల్లిస్తామని చెప్పారు.
నేత కార్మికుల పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే ఆలోచన చేస్తున్నామని మంత్రి తెలిపారు. అలాగే చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆప్కోను మళ్లీ లాభాల దిశగా తీసుకెళ్లేందుకు ప్రత్యేక ప్రక్షాళన చేపట్టామని పేర్కొన్నారు.
ఆప్కో డిజిటలైజేషన్కు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు లభించిందని మంత్రి సవిత తెలిపారు. నేటి అవసరాలకు అనుగుణంగా రెడీమేడ్ చేనేత వస్త్రాల తయారీ, అమ్మకాలను పెంచుతున్నామని చెప్పారు. దీనికోసం నేతన్నలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
డైయింగ్, బ్లీచింగ్, టవల్స్ మరియు ఇతర వస్త్రాల నేయు ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 50 ఏళ్లకే రూ.4,000 పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. అలాగే ప్రతి సంవత్సరం ట్రిఫ్ట్ ఫండ్ కింద రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఆప్కో కొనుగోలు చేసే వస్త్రాలపై 5% జీఎస్టీ మినహాయింపు, నూలుపై 15% సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.
మంగళగిరిలోని ఆప్కో తోటలో జరిగిన ఈ వేడుకల్లో వివిధ ప్రాంతాల చేనేత సహకార సంఘాల ప్రతినిధులను సత్కరించారు. ఆప్కోలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.1.20 లక్షల విలువైన బెనిఫిట్స్ను చెక్ రూపంలో అందజేశారు.
అదే సమయంలో ఆప్కో చరిత్రలో తొలిసారిగా టీటీడీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆసక్తి ఉన్న చేనేత సంఘాలు ముందుకొస్తే టీటీడీకి అవసరమైన దుశ్శాలువాలు, చీరలు, జాకెట్లు, కండువాలు తయారు చేసి సరఫరా చేసే అవకాశం కల్పిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆప్కో ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ, ఆప్కో బలోపేతానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మొత్తం కార్యక్రమం చేనేత రంగానికి కొత్త ఉత్సాహం నింపిందని నేతన్నలు ఆనందం వ్యక్తం చేశారు.
Tags
Be the first to react