AP Development: ఏపీలో 123 పట్టణ స్థానిక సంస్థలకు భారీ నిధులు.. రూ.7,469 కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
AP Development: ఏపీలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.7,469.46 కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, వీధి దీపాల పనులు చేపట్టనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. రాష్ట్రంలోని 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.7,469.46 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పట్టణాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా రహదారి అనుసంధానానికి ప్రాధాన్యత ఇచ్చారు. 123 పట్టణ స్థానిక సంస్థల్లో మిగిలిపోయిన సుమారు 4,388 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ.4,655.82 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా, పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
పట్టణాల్లో పచ్చదనం, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. రూ.509.12 కోట్లతో 541 కొత్త పార్కులను అభివృద్ధి చేయనున్నారు. వీటితో పాటు రూ.247.28 కోట్ల వ్యయంతో 20,340 కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పట్టణాల్లో రాత్రి వేళల్లో వెలుతురు, ప్రజల భద్రతకు మరింత ప్రాధాన్యత లభించనుంది.
అదేవిధంగా పట్టణ రహదారుల మధ్యలో ఉన్న మీడియన్ల సుందరీకరణకు రూ.87.78 కోట్లు కేటాయించారు. మొత్తం 1,186 కిలోమీటర్ల మేర రోడ్ మీడియన్లలో మొక్కలు, పచ్చదనం పెంచే పనులు చేపట్టనున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, వీధి దీపాలు, మీడియన్ల సుందరీకరణ వంటి పనులతో పట్టణాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఈ అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనంత వరకు నెల రోజుల్లో పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. కొన్ని పనులు గడువులో పూర్తికాకపోయినా వాటిని కొనసాగిస్తూ ఎన్నికల నాటికి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు స్పష్టమైన ఫలితాలు కనిపించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Tags
Be the first to react