AP Government: ఏపీలో ఆ జిల్లాలకు ప్రత్యేక జిల్లా పరిషత్‌లు... త్వరలోనే తుది నిర్ణయం!
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటైన జిల్లాల్లో ప్రత్యేక జిల్లా పరిషత్‌ల (Zilla Parishads) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల పాత జెడ్పీల నుండి ఆస్తులు, ఉద్యోగుల విభజన జరిగి గ్రామీణాభివృద్ధి నిధుల కేటాయింపు సులువవుతుంది.
- ప్రతి కొత్త జిల్లాకూ ప్రత్యేకంగా జిల్లా పరిషత్!
- జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు పండగే పండుగ!
- గ్రామీణాభివృద్ధి పనుల్లో ఇక రాకెట్ స్పీడ్!
AP Government: రాష్ట్రంలో ఉమ్మడి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజించినప్పటికీ, స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్‌లు మాత్రం ఇంకా పాత ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మాత్రమే కొనసాగుతున్నాయి. దీనివల్ల నూతన జిల్లాల్లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి పనులు, ZP నిధుల కేటాయింపు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల సమన్వయం మరియు అభివృద్ధి పనుల పర్యవేక్షణలో సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రతి కొత్త జిల్లాకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా పాత ZP ఆస్తులు, ఉద్యోగుల విభజన, ZP ఛైర్మన్ స్థానాల కేటాయింపులు మరియు జెడ్పీటీసీ స్థానాల సరిహద్దుల పునర్విభజనకు సంబంధించి ఉన్నతాధికారులు నివేదికను రూపొందిస్తున్నారు.
కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటు ద్వారా ప్రతి జిల్లాకు ప్రత్యేకంగా జెడ్పీ నిధులు సమకూరడమే కాకుండా, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రోడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా మరియు విద్యా, వైద్య రరంగాల పర్యవేక్షణ వేగవంతం కానుంది. స్థానిక సంస్థల ప్రతినిధుల ద్వారా ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యే అవకాశం ఏర్పడుతుంది.
ఈ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, ఉన్నతాధికారుల భేటీ అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి లేదా వీలైనంత త్వరగా ఈ కొత్త జెడ్పీల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది.
Be the first to react