AP Government: ఏపీ రవాణా శాఖ సేవల్లో విప్లవాత్మక మార్పులు... ఇవి చేయకపోతే కష్టాలు కొనితెచ్చుకున్నట్లే....
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహన ఫైనాన్స్ రద్దు, అడ్రస్ మార్పు, రీ-రిజిస్ట్రేషన్ వంటి ఆర్‌టీఏ సేవలకు ఆటోమేటిక్ ఆన్‌లైన్ అప్రూవల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్‌టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేకుండా, దరఖాస్తు చేసుకున్న వెంటనే మానవ ప్రమేయం లేకుండా డిజిటల్‌గా అనుమతులు మంజూరవుతాయి.
ఆర్సీ లో ఫైనాన్స్ రద్దు, అడ్రస్ చేంజ్ ఇక్కడే!.. ప్రభుత్వం తెచ్చిన నయా ఆటోమేటిక్ సిస్టమ్ ఇదే!
ఇకపై ఆర్‌టీఓ ఆఫీసుల్లో లంచాలకు నో ఛాన్స్...
వాహనదారులకు గుడ్ న్యూస్!.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగానే క్షణాల్లో దక్కే అనుమతులు ఇవే!
AP Government: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఆర్‌టీజీఎస్ (RTGS) సమీక్షా సమావేశంలో రవాణా శాఖ ద్వారా అందుతున్న డిజిటల్ సేవలపై కీలక చర్చ జరిగింది. ప్రస్తుతం రవాణా శాఖ ద్వారా 66 శాతం సేవలు ఆన్‌లైన్‌లో అందుతుండగా, దానిని 100 శాతానికి తీసుకువెళ్లాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగానే అధికారులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకుండా, దరఖాస్తు చేయగానే సిస్టమ్ ద్వారానే ఆటోమేటిక్‌గా అనుమతులు లభించేలా పోర్టల్‌ను రూపొందించారు.
గతంలో వాహన ఈఎంఐ (EMI) పూర్తయిన తర్వాత ఫైనాన్స్ రద్దు చేసుకోవాలన్నా, లేదా ఇంటి అడ్రస్ మారినప్పుడు ఆర్సీలో వివరాలు సవరించుకోవాలన్నా ఆర్‌టీవో (RTO) ఆఫీసుల చుట్టూ వారాల తరబడి తిరగాల్సి వచ్చేది. దళారులు, సిబ్బంది చేతివాటం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. నూతన ఆటోమేటిక్ అప్రూవల్ విధానం ద్వారా వాహనదారులు ఆన్‌లైన్‌లో అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించగానే ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా దరఖాస్తులు క్షణాల్లో ఆమోదం పొందుతాయి.
ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేసిన వాహనాలకు ఏపీలో రీ-రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇకపై అత్యంత వేగవంతం కానుంది. ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ (e-KYC), డిజిటల్ సంతకాలు మరియు బ్యాంక్ ఎన్‌ఓసీ (NOC)లను నేరుగా ఆన్‌లైన్ సిస్టమ్‌లోనే వెరిఫై చేసేలా ఏర్పాట్లు చేశారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది వాహనదారులకు సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా రవాణా శాఖలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన ఆర్టీఏ సేవలను కూడా 100 శాతం డిజిటలైజ్ చేసి, పౌరులకు ఆర్‌టీఓ ఆఫీసులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Tags
Be the first to react