Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు జలకళ.. కృష్ణా డెల్టాకు పట్టిసీమ నుంచి 17.52 టీఎంసీల నీరు!
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌కు గోదావరి జలాలు చేరడంతో జలకళ సంతరించుకుంది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదికి తరలిస్తున్న గోదావరి నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళ్తున్న సమయంలో సీఎం తన కాన్వాయ్‌ను కొద్దిసేపు బ్యారేజ్‌పై నిలిపి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు..
గోదావరి జలాలతో నిండుకుండలా ప్రకాశం బ్యారేజ్.. నీటి ప్రవాహాన్ని పరిశీలించిన సీఎం..
అమరావతి: ప్రకాశం బ్యారేజ్‌కు గోదావరి జలాలు చేరడంతో జలకళ సంతరించుకుంది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదికి తరలిస్తున్న గోదావరి నీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని తిరిగి నివాసానికి వెళ్తున్న సమయంలో సీఎం తన కాన్వాయ్‌ను కొద్దిసేపు బ్యారేజ్‌పై నిలిపి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు.
గోదావరి నీటితో ప్రకాశం బ్యారేజ్ నిండుగా కనిపించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉందని సీఎం ఈ సందర్భంగా అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు అందుతున్న నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 17.52 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా ప్రవాహాలు రావడంతో ఇప్పటివరకు సుమారు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసినట్లు అధికారులు తెలిపారు.
పట్టిసీమ ద్వారా సమృద్ధిగా గోదావరి జలాలు అందుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న వివిధ కాలువల ద్వారా కృష్ణా డెల్టా పంటలకు నీటిని విడుదల చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు వివిధ ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. అధికారుల వివరాల ప్రకారం కృష్ణా తూర్పు ప్రధాన కాలువ: 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ: 3,115 క్యూసెక్కులు, గుంటూరు చానల్: 115 క్యూసెక్కులు, మొత్తంగా డెల్టాలోని వివిధ కాలువలకు 7,158 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టిసీమ నీరు పంటలకు ఎంతో ఉపయోగపడుతోందని చంద్రబాబు అన్నారు. వర్షాలు తక్కువగా ఉన్న సమయంలో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చేందుకు అవకాశం ఏర్పడుతోందని పేర్కొన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు రాకుండా నీటి లభ్యతను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.
ఎల్‌నినో పరిస్థితుల్లో సాగునీటి సమస్యలను అధిగమించేందుకు అధికారులు సమర్థవంతమైన నీటి నిర్వహణ చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. అందుబాటులో ఉన్న జలాలను వృథా కాకుండా అవసరమైన ప్రాంతాలకు చేరేలా ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణాకు చేరి, అక్కడి నుంచి డెల్టా కాలువల్లో ప్రవహిస్తుండటంతో సాగు ప్రాంతాల్లో నీటి భరోసా పెరుగుతోంది. వర్షాభావ పరిస్థితుల్లో ఈ జలాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అధికారులు తెలిపారు.
Be the first to react