⚡ BREAKING

New Highway: ఫ్యూచర్ సిటీ టూ బందరు పోర్ట్.. 12 లేన్ల భారీ హైవే మాస్టర్ ప్లాన్! 100 కి.మీ తగ్గనున్న దూరం!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చేసేలా ఒక భారీ జాతీయ రహదారి ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రతిపాదించారు.

1000646472
1000646472

New Highway: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ' (రావిర్యాల పరిసర ప్రాంతాలు) నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం (బందరు) పోర్టు వరకు ఏకంగా 12 లేన్ల (12-Lane) గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే అందుబాటులోకి వస్తే రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక రంగాలు సరికొత్త పుంతలు తొక్కుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ - విజయవాడ మధ్య 100 కిలోమీటర్ల దూరం హల్వా!

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే జాతీయ రహదారి (NH-65) పై వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన ఈ కొత్త 12 లేన్ల రహదారి నిర్మాణం పూర్తయితే ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.

దూరం తగ్గుతుంది: ఈ కొత్త అలైన్మెంట్ వల్ల హైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణ దూరం సుమారు 100 కిలోమీటర్ల మేర తగ్గుతుంది.

సమయం ఆదా:దూరం తగ్గడమే కాకుండా 12 లేన్ల హైవే కావడంతో ప్రయాణ సమయం కూడా భారీగా కలిసి వస్తుంది.

వేగవంతమైన సరుకు రవాణా: తెలంగాణలోని పరిశ్రమల నుంచి ఆంధ్రప్రదేశ్లోని బందరు పోర్టుకు ఎగుమతులు, దిగుమతులు చాలా సులభంగా, వేగంగా సాగుతాయి.

ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) పై స్పెషల్ ఫోకస్

హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదించిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) పనులను వేగవంతం చేయడంపై కూడా కేంద్రమంత్రితో సీఎం చర్చించారు.

1. ఉత్తర భాగం (Northern Part): ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ త్వరగా ఆమోదం తెలపాలని కోరారు.

2. దక్షిణ భాగం (Southern Part): దీనికి సంబంధించిన తుది అనుమతులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే హైదరాబాద్పై ట్రాఫిక్ భారం తగ్గడమే కాకుండా, చుట్టుపక్కల జిల్లాల రూపురేఖలు మారిపోతాయని సీఎం వివరించారు.

నితిన్ గడ్కరీ ముందు ఉంచిన ఇతర కీలక విజ్ఞప్తులు

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రానికి గుర్తు చేస్తూ, తెలంగాణ రవాణా రంగానికి ఊతమిచ్చే మరికొన్ని ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి ముందు ఉంచారు:

మన్ననూరు - శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్: నల్లమల అటవీ ప్రాంతం, శ్రీశైలం జలాశయం పరిధిలో ఈ ప్రాజెక్టు ఉంది. దీనికి అటవీ శాఖ (Forest Clearances) నుంచి రావాల్సిన అనుమతులను కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వేగంగా మంజూరు చేయాలని కోరారు.

హైదరాబాద్ - మంచిర్యాల 6 లేన్ల హైవే: రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఈ 6 వరుసల జాతీయ రహదారిని మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి అవసరమైన భూసేకరణ (Land Acquisition) బాధ్యతను పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రికి హామీ ఇచ్చారు.

రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని పెంచే ఈ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలు పట్టాలెక్కితే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు, వ్యాపారులకు ఎంతో మేలు చేకూరనుంది.

Tags

Be the first to react

Latest