భారత ప్రభుత్వము దేశాన్ని ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా నిలబెట్టే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. అదే లక్ష్యంతో ఎలక్ట్రಾನిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీమ్ (ECMS) కింద రూ.7,172 కోట్ల పెట్టుబడులతో మరో 17 ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ యూనిట్లు దేశంలోని 9 రాష్ట్రాల్లో స్థాపించబడ్డాయి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు కూడా చోటు దక్కడం రాష్ట్రానికి మరింత శుభవార్తగా మారింది. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 11,808 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రం వెల్లడించింది.
ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ యూనిట్ల ఏర్పాటుకు అనుమతి లభించడం రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాల పరంగా పెద్ద లాభంగా భావిస్తున్నారు. ఈ ఆమోదం ECMS రెండో విడతలో భాగం కాగా, మొదటి విడతలోనే రూ.5,532 కోట్ల పెట్టుబడులతో ఏడు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇప్పుడు రెండో విడతలో మొత్తం 17 యూనిట్లు దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.
గోవా, గుజరాత్, జమ్మూ–కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఆధునిక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా దేశంలోనే తొలి ఆప్టికల్ ట్రాన్స్‌సీవర్ తయారీ యూనిట్‌ను జాబిల్ సర్క్యూట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జెట్చెమ్ సప్లై చైన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఏర్పాటు చేయనుండటం ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా కమ్యూనికేషన్ పరికరాలు, కంప్యూటర్లు వంటి రంగాల్లో ఉపయోగించే అధునాతన ఆసిలేటర్లు రాకోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేయనుంది.
ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి పరికరాల కోసం ఎన్‌క్లోజర్ తయారీని ఏక్వాస్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చేపట్టనుండగా, అసక్స్ సేఫ్టీ కాంపోనెంట్స్, యునో మిండా, సిర్మా మొబిలిటీ వంటి సంస్థలు కెమెరా మాడ్యూల్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి. ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌ల కోసం కనెక్టర్‌లను తయారు చేయడానికి టీఈ కనెక్టివిటీ ఇండియా సంస్థకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ సంస్థల ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత అన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
డిజిటల్ ఎకానమీ, ఆధునిక ఉత్పత్తి రంగాల అభివృద్ధి, నైపుణ్యాల పెంపు వంటి అంశాలపై దృష్టి పెట్టిన ఈ పథకం ద్వారా సమతుల్య ప్రాంతీయ అభివృద్ధికి కూడా అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ICEA నిర్వహించిన ECMS కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఈ ప్రాజెక్టులు భారత ఎలక్ట్రానిక్స్ రంగ సామర్థ్యాన్ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తాయని అన్నారు. రాష్ట్రాలకు పెట్టుబడులు, ప్రజలకు ఉపాధి అనే రెండు విధాల లాభాలు ఈ ఆమోదాల ద్వారా కలుస్తున్నాయి.