2014 నుంచి 2019 మధ్యకాలంలో అమలైన నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల (Pending Bills) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. గత కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎదురుచూస్తున్న చెల్లింపులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పాత బిల్లుల్లో పెద్ద భాగాన్ని క్లియర్ చేసిన ప్రభుత్వం, తాజాగా వచ్చిన బిల్లులను కూడా ప్రాసెస్‌లో పెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ అంశంపై ముఖ్యమంత్రి సూచనల మేరకు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ, నీరు–చెట్టు బిల్లుల చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఇవాళ మరోసారి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఫైనాన్స్, ఇరిగేషన్, జీఎస్టీ శాఖల అధికారులు పాల్గొని తాజా పరిస్థితిని మంత్రికి వివరించారు.
అధికారుల నివేదికల ప్రకారం, గతంలోనే సుమారు రూ.800 కోట్ల మేర నీరు–చెట్టు బిల్లులకు ప్రభుత్వం చెల్లింపులు చేసింది. తాజాగా ఆ మొత్తాన్ని మరింత పెంచుతూ మొత్తం రూ.840 కోట్ల వరకు బిల్లులు క్లియర్ చేసినట్లు మంత్రికి వివరించారు. దీంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ఊరట లభించినట్లైంది. ఇదిలా ఉండగా, ఈ వారంలోనే ఆన్‌లైన్‌లో అప్లోడ్ అయిన దాదాపు రూ.40 కోట్ల విలువైన బిల్లులను కూడా ఆర్థిక శాఖ ప్రాసెస్‌లోకి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
అయితే (Andhra Pradesh Government) కొంత మొత్తం బిల్లులు ఆర్థిక శాఖకు చేరకుండా పెండింగ్‌లోనే ఉన్నట్లు సమావేశంలో వెల్లడైంది. దాదాపు రూ.60 కోట్ల విలువైన బిల్లులు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగా ఆమోద దశకు చేరలేకపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి పయ్యావుల, ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని స్పష్టం చేశారు.
జీఎస్టీ రిజిస్ట్రేషన్ (GST Issues) సమస్యల వల్ల బిల్లులు ఆగిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం (Irrigation Bills) ఇరిగేషన్ ఈఈ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కౌంటర్లలో ఇరిగేషన్ శాఖతో పాటు జీఎస్టీ శాఖ అధికారులు కూడా అందుబాటులో ఉండి, బిల్లులకు సంబంధించిన సాంకేతిక అడ్డంకులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రూ.60 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. కేవలం సాంకేతిక కారణాల వల్లే ఈ బిల్లులు ఆలస్యం అవుతున్నాయని, ఆ సమస్యలు తొలగిన వెంటనే చెల్లింపులు చేపడతామని ఆయన తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సమస్యను వేగంగా పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.