భారతదేశంలో టూవీలర్ కొనాలనుకునే ఎవరైనా సరే.. ఖచ్చితంగా ఆలోచించే రెండు పేర్లు హోండా యాక్టివా (Honda Activa) మరియు టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter). మార్కెట్లో ఎన్ని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చినా, ఈ రెండింటి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా సిటీలో ఆఫీసులకు వెళ్లేవారు, కాలేజీ విద్యార్థులు మరియు గృహిణులు వీటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? దేని ధర ఎంత? మైలేజ్ ఏది ఎక్కువగా ఇస్తుంది? వంటి పూర్తి వివరాలను సులభంగా అర్థమయ్యేలా ఇక్కడ తెలుసుకుందాం.
హోండా యాక్టివా (HondaActiva)
హోండా యాక్టివా 6 రంగుల వేరియంట్‌లలో భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంది. హోండాకు చెందిన ఈ స్కూటర్ స్టాండర్డ్, DLX, స్మార్ట్ మూడు వేరియంట్‌లలో మార్కెట్‌లో ఉంది. ఈ స్కూటర్ స్టాండర్డ్ మోడల్లో హలోజన్ హెడ్‌లైట్స్, DLX, స్మార్ట్ మోడల్లో LED హెడ్‌లైంప్లు ఉన్నాయి. ఈ టూ వీలర్ స్మార్ట్ వేరియంట్‌లో మాత్రమే బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ ఫీచర్ ఇచ్చారు.
హోండా యాక్టివాలో స్టాండర్డ్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 74,619 రూపాయలు, DLX మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 84,272 రూపాయలుగా ఉంది. ఇక స్మార్ట్ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర 87,944 రూపాయలు అని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్లో 4-స్ట్రోక్, SI ఇంజిన్ ఉంటుంది. హోండా యాక్టివా రోడ్లు, ఏరియాను బట్టి 60 kmpl మైలేజ్ ఇస్తుందని పేర్కొంది.
టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter)
టీవీఎస్ జూపిటర్ 4 వేరియంట్‌లలో భారత మార్కెట్‌లో అందుబాటులో ఉంది. స్పెషల్ ఎడిషన్, స్మార్ట్ Xonnect డిస్క్, స్మార్ట్ Xonnect డ్రమ్, డ్రమ్ అల్లాయ్. ఈ స్కూటర్ 7 రంగుల ఎంపికలలో వస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఎక్స్-షోరూమ్ ధర 72,400 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. టీవీఎస్ ఈ స్కూటర్లో సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్ ఇంజిన్ ఇచ్చారు., ఇది 6,500 rpm వద్ద 5.9 kW పవర్, 5,000 rpm వద్ద 9.2 Nm టార్క్ అందిస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఒక లీటర్ పెట్రోల్‌తో 53 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని సంస్థ పేర్కొంది.
టీవీఎస్ ఈ స్కూటర్లో రెండు హెల్మెట్‌లను ఉంచుకోవడానికి తగినంత స్థలం ఉంటుంది. ఈ స్కూటర్ శైలి విషయానికి వస్తే.. ఇందులో టెయిల్ లైట్ బార్ ఇచ్చారు. ఈ టూ-వీలర్లో భద్రతపై ఎక్కువ శ్రద్ధ చూపారు. కొంతమంది స్కూటర్ ను స్టార్ట్ చేసే ముందు సైడ్ స్టాండ్ తీయడం మర్చిపోతుంటారు. అందుకు పరిష్కారం కోసం, ఈ స్కూటర్లో సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇచ్చారు.
ఏది కొనాలి?
ఈ రెండు స్కూటర్లు దాదాపు ఒకే స్థాయి పర్ఫార్మెన్స్ ఇస్తాయి. కానీ చిన్న చిన్న మార్పులు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు:
హోండా యాక్టివా ఎప్పుడు ఎంచుకోవాలి?
మీకు రీసెల్ వాల్యూ ముఖ్యం అనుకుంటే, సింపుల్ మెకానిజం మరియు హోండా ఇంజన్ రిలయబిలిటీ కావాలనుకుంటే యాక్టివా బెస్ట్ ఛాయిస్. ముఖ్యంగా దీని మెటల్ బాడీ దీర్ఘకాలం మన్నిక ఇస్తుంది.
టీవీఎస్ జూపిటర్ ఎప్పుడు ఎంచుకోవాలి?
మీకు రైడింగ్ సౌకర్యం (12-అంగుళాల వెనుక చక్రం వల్ల జంప్‌లు తక్కువగా ఉంటాయి), ఎక్కువ స్టోరేజ్ స్పేస్, మరియు నావిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు తక్కువ ధరలోనే కావాలంటే జూపిటర్ వైపు మొగ్గు చూపవచ్చు.