వందో ప్రయోగాన్ని ఘన విజయంగా పూర్తి చేసి 2025 సంవత్సరానికి గుడ్‌బై చెప్పిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO), 2026 సంవత్సరానికి తొలి ప్రయోగంతోనే ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నుంచి ఈ రోజు మరో కీలక రాకెట్ ప్రయోగం జరగనుంది. కౌంట్‌డౌన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యాక, ఉదయం 10 గంటల 17 నిమిషాలకు PSLV C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో 2026 సంవత్సరానికి ఇస్రో బోణీ కొట్టబోతుండటంతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ఈ PSLV C-62 రాకెట్ మొత్తం 15 ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లనుంది. వీటిలో 8 విదేశీ ఉపగ్రహాలు, ఒక కీలకమైన EOS-N1 ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం ఉన్నాయి. ఈ EOS-N1 ఉపగ్రహం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) అభివృద్ధి చేసిన తొమ్మిదో పూర్తి స్థాయి వాణిజ్య ఉపగ్రహంగా నిలవనుంది. 1,485 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని భూమి నుండి సుమారు 600 కిలోమీటర్ల ఎత్తులోని సన్-సింక్రనైజ్డ్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఇదే ప్రయోగంలో 200 కిలోల బరువుతో ఉన్న మిగతా చిన్న ఉపగ్రహాలను కూడా విజయవంతంగా కక్ష్యలోకి పంపనున్నారు.
భారత రక్షణ వ్యవస్థకు ఇప్పటివరకు మూడో నేత్రంలా పనిచేసిన అనేక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఇస్రో, ఇప్పుడు ‘అన్వేషణ’ అనే ప్రత్యేక సిరీస్‌ను ప్రారంభిస్తోంది. ఇక నుంచి భూ పరిశీలన, సరిహద్దుల నిఘా, దేశ భద్రతకు కీలకంగా ఉపయోగపడే అన్ని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లను అన్వేషణ సిరీస్ కింద ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించింది. ఈ ఉపగ్రహాలు వాతావరణ మార్పులు, సహజ విపత్తులను ముందుగానే గుర్తించడమే కాకుండా, పొరుగు దేశాల కదలికలపై అంతరిక్షం నుంచే నిఘా పెట్టే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీంతో దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.
ఈ అత్యంత కీలక ప్రయోగానికి ముందు ఇస్రో ఛైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి, రాకెట్ మరియు ఉపగ్రహ నమూనాలను స్వామి పాదాల దగ్గర ఉంచి పూజలు చేయించారు. అలాగే శ్రీకాళహస్తిలోని ముక్కంటి స్వామి ఆలయం, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాల్లోనూ ప్రార్థనలు చేశారు. ఈ ప్రయోగం దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. మొత్తంగా 2026 సంవత్సరం ప్రారంభంలోనే ‘అన్వేషణ’ పేరుతో చేపడుతున్న ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం విజయవంతం కావాలని దేశమంతా ఆకాంక్షిస్తోంది.