ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మరో కొత్త పథకం తీసుకురానుంది. పేద బ్రాహ్మణుల (brahmins) కోసం గరుడ పేరు (Garuda Scheme) తో పథకం ప్రారంభించనుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి సవిత వెల్లడించారు. బ్రాహ్మణుల కోసం త్వరలోనే గరుడ పథకం ప్రారంభిస్తామని మంత్రి సవిత తెలిపారు.
ఇందులో భాగంగా బ్రాహ్మణులు మరణిస్తే.. వారి కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.10 వేలు అందించనున్నట్లు సవిత వివరించారు. ఈ పథకం అమలు కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించినట్లు వివరించారు. సచివాలయంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ మంత్రి సవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గరుడ పథకానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సవిత (minister savitha) తెలిపారు.
బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ తొలి నుంచి అండగా ఉంటోందని మంత్రి సవిత అన్నారు. గరుడ పథకం కింద అందించే సాయం కష్టసమయంలో వారికి ఉపశమనంగా ఉంటుందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను సైతం చంద్రబాబే ఏర్పాటు చేశారన్న సవిత.. ఈ కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. 2014 -19 మధ్యకాలంలో చంద్రబాబు పది పథకాలను అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆలయాలలో ధూపదీప నైవేద్యాలకు కూడా నిధులు అందించామన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని నిలిపివేశారని సవిత ఆరోపించారు.
గరుడ పథకం అంటే ఏమిటి? దీని వల్ల లాభమేంటి?
పేదరికంలో ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా చనిపోతే, ఆ సమయంలో అంత్యక్రియలు మరియు ఇతర కర్మకాండలు నిర్వహించుకోవడానికి తక్షణ ఆర్థిక సాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రభుత్వం రూ. 10,000 అందజేస్తుంది. కష్టసమయంలో ఉన్న కుటుంబానికి ఈ మొత్తం ఒక చిన్న ఆసరాగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ద్వారా ఈ నగదు పంపిణీ జరుగుతుంది.
దరఖాస్తుకు కావాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏమిటి?
ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ (వైట్), కుల ధృవీకరణ పత్రం (Caste Certificate), మరణించిన వారి డెత్ సర్టిఫికేట్ మరియు దరఖాస్తుదారుడి బ్యాంక్ పాస్‌బుక్ కాపీ అవసరం.
దరఖాస్తు చేసుకోవడం ఎలా?
గరుడ పథకం కింద సాయం పొందడానికి ప్రాథమిక విధివిధానాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి. సాధారణంగా ఇలాంటి పథకాలకు:
బ్రాహ్మణ కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
వార్షిక ఆదాయం నిర్ణీత పరిమితి (గతంలో రూ. 75,000 లోపు) లోపు ఉండాలి.
మరణించిన ధ్రువీకరణ పత్రం (Death Certificate) తో కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అమలులో ఉన్న ఇతర పథకాలు ఏమిటి?
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా భారతి (ఉన్నత విద్య), గాయత్రి (స్కాలర్‌షిప్స్), వేదవ్యాస (వేద విద్య), కశ్యప (ఆహారం & వసతి సాయం) వంటి పథకాలు అమలులో ఉన్నాయి.