టీటీడీలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నియామకాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఉద్యోగాల భర్తీ, సర్వీసు నిబంధనల సవరణలు, అలాగే పదోన్నతుల అంశాలపై టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. డిసెంబర్ 16న నిర్వహించిన పాలకమండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, తుది అనుమతుల కోసం ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం వచ్చిన వెంటనే ఈ నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. దీంతో ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులు, సిబ్బందిలో ఆశలు చిగురించాయి.
ముఖ్యంగా ఎస్వీ గోసంరక్షణ శాల అభివృద్ధికి పాలకమండలి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. గోశాలలో పనిచేస్తున్న సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని 12 కొత్త పోస్టులను మంజూరు చేసింది. వీటిలో అసిస్టెంట్ డైరెక్టర్ (2), గోశాల మేనేజర్ (2), డైరీ సూపర్‌వైజర్ (6), డైరీ అసిస్టెంట్ (2) పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాల వల్ల ఏడాదికి సుమారు రూ.1.05 కోట్ల అదనపు ఆర్థిక భారం పడుతుందని, అయితే ఈ ఖర్చును పూర్తిగా టీటీడీ నిధుల నుంచే భరిస్తామని పాలకమండలి స్పష్టం చేసింది. పశుపోషణ విభాగంలో డిప్లొమాతో పాటు కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు. గోసంరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే ఈ నిర్ణయాల ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఇదే సమావేశంలో టీటీడీ వైద్య విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఒకే హోదాలో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు మార్గం సుగమమైంది. రేడియోగ్రాఫర్ పోస్టును ‘చీఫ్ రేడియోగ్రాఫర్’గా అప్‌గ్రేడ్ చేయగా, ఫిజియోథెరపిస్ట్ పోస్టును కూడా ఉన్నత హోదాగా మార్చారు. ఈ మార్పులతో ఆయా విభాగాల్లోని సిబ్బందికి ప్రమోషన్లు లభించనున్నాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఇది పెద్ద ఊరటగా మారనుంది.
ఆలయ కైంకర్యాలకు సంబంధించిన పోస్టుల నియామకాల విషయంలోనూ టీటీడీ కీలక స్పష్టత ఇచ్చింది. తాళ్లపాక కైంకర్యపరుడు, మణ్యం దార్ పోస్టులకు వంశపారంపర్య హక్కులు కల్పించాలన్న అభ్యర్థనలను పాలకమండలి తిరస్కరించింది. 1987 టీటీడీ చట్టం ప్రకారమే నియామకాలు జరుగుతాయని స్పష్టం చేసింది. తాళ్లపాక కైంకర్యపరుడు పోస్టుకు సంకీర్తనల్లో ప్రావీణ్యం ఉండటంతో పాటు 40 ఏళ్లలోపు వయస్సు ఉండాలని నిబంధన విధించారు. మణ్యం దార్ పోస్టుకు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణతతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారై ఉండాలని పేర్కొన్నారు. అదేవిధంగా బర్డ్ ఆసుపత్రి, శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలోని కొన్ని పోస్టులకు సంబంధించిన అర్హతల్లోనూ సవరణలు చేశారు. ఈ నిర్ణయాలు టీటీడీలో నియామక ప్రక్రియకు మరింత పారదర్శకత తీసుకురానున్నాయి.