గ్రీన్లాండ్లో వ్యూహాత్మక పరిణామాలు ప్రపంచ రాజకీయ వేదికపై కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో కీలక స్థానం కలిగిన గ్రీన్లాండ్ ఇప్పటికే అంతర్జాతీయ శక్తుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రాంతంగా మారింది. తాజాగా అక్కడి పిటుఫిక్ స్పేస్ బేస్‌కు అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాన్ని పంపించడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఉత్తర అమెరికా రక్షణ వ్యవస్థలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని NORAD ప్రకటించింది. ముఖ్యంగా రష్యా, చైనా వంటి దేశాలు ఆర్కిటిక్‌లో తమ ప్రభావాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అమెరికా ముందస్తు భద్రతా చర్యలకు దిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రీన్లాండ్ భౌగోళికంగా ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉండటంతో ఉపగ్రహ నిఘా, క్షిపణి హెచ్చరిక వ్యవస్థలకు ఇది కీలక కేంద్రంగా మారింది. అందుకే అక్కడ సైనిక ఉనికిని పెంచుకోవడం అమెరికాకు వ్యూహాత్మక అవసరంగా మారింది.
మరోవైపు గ్రీన్లాండ్‌పై అధికారిక పరిపాలన కలిగిన డెన్మార్క్ కూడా పరిస్థితిని గమనించి అప్రమత్తమైంది. గ్రీన్లాండ్‌లో అదనపు సైన్యాన్ని మోహరించడం, ఆధునిక మిలిటరీ ఎక్విప్మెంట్‌ను తరలించడం ద్వారా డెన్మార్క్ తన సార్వభౌమాధికారాన్ని స్పష్టంగా చాటే ప్రయత్నం చేస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న అంతర్జాతీయ పోటీ దృష్ట్యా గ్రీన్లాండ్ భద్రతపై రాజీ పడకూడదనే నిర్ణయానికి డెన్మార్క్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రీన్లాండ్‌కు స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ రక్షణ, విదేశాంగ వ్యవహారాలు డెన్మార్క్ నియంత్రణలోనే ఉన్నాయి. అందుకే అమెరికా వంటి మిత్రదేశాల చర్యలు కూడా తమ అనుమతితోనే జరగాలని డెన్మార్క్ భావిస్తోంది.
ఇదిలా ఉండగా, గ్రీన్లాండ్‌ను అమెరికా దక్కించుకోవాలనే ఆలోచన గతంలో ట్రంప్ వ్యక్తం చేసిన విషయం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రీన్లాండ్ ఖనిజ సంపద, చమురు వనరులు, అరుదైన లోహాలు, అలాగే ఆర్కిటిక్ సముద్ర మార్గాలపై నియంత్రణ వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ట్రంప్ కాలంలో వెలువడిన ఆ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారినా, ఇప్పుడు తాజా సైనిక కదలికలతో మళ్లీ చర్చకు వస్తున్నాయి. దీనివల్ల గ్రీన్లాండ్ భవిష్యత్ రాజకీయ స్థితిగతులపై అంతర్జాతీయ ఆసక్తి మరింత పెరిగింది.
మొత్తానికి గ్రీన్లాండ్ ఇప్పుడు కేవలం మంచు ద్వీపంగా కాకుండా, భవిష్యత్ గ్లోబల్ శక్తి సమీకరణాల్లో కీలక కేంద్రముగా మారుతోంది. అమెరికా, డెన్మార్క్ రెండూ తమ సైనిక శక్తిని పెంచడం ఒకవైపు భద్రతా చర్యగా కనిపించినప్పటికీ, మరోవైపు అంతర్జాతీయ శక్తి పోటీకి నిదర్శనంగా మారింది. రాబోయే రోజుల్లో ఆర్కిటిక్ ప్రాంతంలో రాజకీయ, సైనిక పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.