ఏపీ రాష్ట్ర రైతులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించనుంది. రైతులు తమ ధాన్యాన్ని సేకరణ కేంద్రాల్లో విక్రయించిన రోజే వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ధాన్యం అమ్మిన తర్వాత రైతులు కనీసం 24 గంటల నుంచి కొన్ని వారాల వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ సమస్య పూర్తిగా తొలగిపోతుందని తెలిపారు. ఉదయం ధాన్యం విక్రయిస్తే సాయంత్రం కల్లా డబ్బులు రైతుల అకౌంట్లలోకి చేరేలా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ధాన్యం సేకరణ జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇప్పటివరకు 41.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, దాదాపు 6 లక్షల 83 వేల 623 మంది రైతుల ఖాతాల్లో రూ.9,890 కోట్లను జమ చేసినట్లు తెలిపారు. గతంలో ధాన్యం అమ్మిన రైతులు డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ అవసరం లేదన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఆర్థిక భరోసా లభిస్తోందని, సాగు పనులు సజావుగా సాగేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
రబీ సీజన్‌లో ధాన్యం సేకరణకు కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతుల ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతుల కోసం ప్రత్యేక రైలు నడపడం చరిత్రలో ఇదే తొలిసారి అని మంత్రి పేర్కొన్నారు. రబీ సీజన్‌లో గోతాలు, రవాణా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
ప్రస్తుతం గుంటూరు, తిరుపతి, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఖరీఫ్ ధాన్యం సేకరణ కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. జీపీఎస్ వ్యవస్థ, తేమ శాతం పరిశీలన, రవాణా సదుపాయాలను ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తోందన్నారు. విజయవాడలో పౌరసరఫరాల శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, రైతులకు నిధుల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ధాన్యం అమ్మిన రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ చేయాలనే ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.