ప్రతి రోజు ఉదయం ఉదయించే సూర్యుడు జీవకోటికి ఒక ఆరాధ్య దైవంగానే చెప్పుకోవాలి హిందూ సంప్రదాయంలో జీవనశక్తికి ప్రతీకగా భావించబడతాడు సూర్య భగవాన్. అలాంటి సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని పెద్దల నమ్మకం. ముఖ్యంగా బెల్లం కలిపిన నీటితో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే ఆచారం చాలా పురాతనమైనది. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, మన మనసు, శరీరం, జీవన విధానంపై మంచి ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం:
సూర్యుడు ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, తండ్రి, ప్రభుత్వ వ్యవహారాలు, నాయకత్వ లక్షణాలను సూచించే ముఖ్యమైన గ్రహం. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం తగ్గడం, ఆరోగ్య సమస్యలు రావడం, పనుల్లో ఆటంకాలు ఎదురవడం వంటి పరిస్థితులు ఏర్పడుతాయని నమ్ముతారు. అలాంటి సమయంలో సూర్యుడికి ప్రతిరోజూ అర్ఘ్యం ఇవ్వడం ద్వారా సూర్య దోషం శాంతిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. బెల్లం కలిపిన నీరు సమర్పిస్తే ఈ ఫలితం మరింత పెరుగుతుందని విశ్వాసం.
బెల్లం సూర్యుడికి ప్రీతి మైనది
బెల్లం సూర్యుడికి ఇష్టమైన పదార్థంగా భావిస్తారు. బెల్లం మాధుర్యం సూర్యుని తీవ్రతను సమతుల్యం చేస్తుందని, మనస్సుకు శాంతిని ఇస్తుందని అంటారు. ఉదయం సూర్య కిరణాల మధ్య బెల్లం నీటిని సమర్పించడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలసట, నిరుత్సాహం తగ్గి, పనిపై ఆసక్తి పెరుగుతుందని చాలామంది అనుభవంతో చెబుతుంటారు. అంతేకాదు, కుటుంబంలో శాంతి, ఐక్యత పెరుగుతుందని కూడా నమ్మకం.
ఈ ఆచారం చేయడం చాలా సులభం:
ఉదయం సూర్యోదయ సమయంలో లేచి శుభ్రంగా స్నానం చేసి, ఒక రాగి పాత్రలో స్వచ్ఛమైన నీరు తీసుకుని అందులో చిన్న బెల్లం ముక్క కలపాలి. తూర్పు దిశగా సూర్యుడిని చూస్తూ నిలబడి, మనసులో భక్తితో సూర్య నామాన్ని స్మరిస్తూ నెమ్మదిగా నీటిని సమర్పించాలి. నీరు సూర్య కిరణాలపై పడేలా చూడాలి. ఈ సమయంలో “ఓం సూర్య నమః” వంటి మంత్రం జపిస్తే మరింత మంచిదని గురువులు తెలుపుతున్నారు
ప్రతిరోజూ ఈ విధంగా సూర్యారాధన చేయడం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరిగి, నిర్ణయాలు తీసుకునే శక్తి వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడటం, నిద్ర బాగుండటం వంటి లాభాలు కూడా కలుగుతాయని విశ్వాసం. ముఖ్యంగా సూర్య దోషం లేదా పితృ దోషం ఉందని భావించే వారికి ఈ సాధారణ పరిహారం ఉపయోగకరంగా ఉంటుందని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. భక్తితో, క్రమం తప్పకుండా ఈ ఆచారాన్ని పాటిస్తే జీవితంలో సానుకూల మార్పులు రావచ్చని పెద్దల సూచన.