- అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మకు చంద్రబాబు శుభాకాంక్షలు..
- ఆహార శుద్ధి రంగంలో గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్: ఏపీ రైతులకు యూఏఈ రూపంలో కొత్త మార్కెట్!
- దావోస్‌లో అస్సాం హిస్టరీ: తొలిసారి సదస్సుకు హాజరైన సీఎం హిమంత.. బాబు అభినందనలు!
స్విట్జర్లాండ్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు అస్సాం నుంచి హాజరవుతున్న తొలి ముఖ్యమంత్రిగా నిలిచారంటూ హిమంత బిశ్వశర్మను చంద్రబాబు 'ఎక్స్' వేదికగా అభినందించారు. ప్రపంచ వేదికపై అస్సాంకు ప్రాతినిధ్యం వహించడం ద్వారా శర్మ చరిత్ర సృష్టించారని కొనియాడారు. పెట్టుబడుల సాధనలో ఆయన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక మంత్రి భేటీ..
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక-పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ – యూఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది.
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యూఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు అల్ మార్రీ అంగీకారం తెలిపారు. అలాగే యూఈఏకి చెందిన సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఆహార భద్రత, లాజిస్టిక్స్, పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను అల్ మార్రీకి ముఖ్యమంత్రి వివరించారు.
యూఏఈకి చెందిన షరాఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్ ఏర్పాటు..., డీపీ వరల్డ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్థాయి పోర్ట్ టెర్మినల్స్, లాజిస్టిక్స్ మౌలిక వసతుల అభివృద్ధి..., ఏడీఎన్‌ఓసీ సంస్థ ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్, రీగ్యాసిఫికేషన్ యూనిట్ ఏర్పాటు... విశాఖలో లూలూ గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణంపైనా చర్చించారు.
యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఏపీలో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ భవిష్యత్‌లో యూఏఈ ప్రభుత్వంతో పాటు ప్రముఖ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ పాల్గొన్నారు.