టాటా మోటార్స్ మరోసారి తన బ్రాండ్ చరిత్రలో గుర్తుండిపోయే ఐకానిక్ SUV సియారా ను తిరిగి మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. 1991లో మొదటిసారి భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన సియారా, అప్పట్లోనే తన ప్రత్యేకమైన త్రీ-డోర్ డిజైన్, అప్పటి కాలానికి కొత్తగా భావించిన అర్బన్ SUV స్టైల్‌తో యువతలో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పుడు టాటా మోటార్స్ అదే పేరును, కాని పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌ను ఆధారంగా తీసుకుని ఆధునిక టెక్నాలజీ, ట్రెండీ డిజైన్ ఎలిమెంట్స్, మరోలెవెల్ ఫీచర్లతో ఇది మళ్లీ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో రీ-ఎంట్రీ చేయడానికి సిద్ధమైంది.
కొత్త సియారా 5-సీటర్ SUVగా వస్తోంది. దీని ధరలను నవంబర్ 25న అఫీషియల్‌గా ప్రకటించనున్నట్లు సమాచారం. మార్కెట్ అంచనాల ప్రకారం ఈ SUV ధర రూ.11 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన కాన్సెప్ట్ చిత్రాలను చూసిన ఆటో లవర్స్, సియారా మళ్లీ రాబోతుందన్న వార్తపై భారీ ఎగ్జయిట్‌మెంట్ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, కొత్త సియారా లుక్స్ ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను కొంతవరకు పోలిక కలిగివున్నాయని ఆటో నిపుణులు పేర్కొంటున్నారు. బాక్సీ డిజైన్, బలమైన బాహ్య నిర్మాణం, హై-స్టాన్స్ SUV ప్రొఫైల్, ప్యానొరమిక్ విండోలు, ఆధునిక LED లైట్లు ఈ కారు లుక్‌ను మరోలెవెల్‌కు తీసుకెళ్తున్నాయి.
కొత్త సియారా 6 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో రానుంది. ఇందులో అడ్వెంచర్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, పర్ల్ వైట్, డెజర్ట్ సాండ్, మెటల్ సిల్వర్, మరియు ఒక స్పెషల్ డ్యూయల్ టోన్ వేరియంట్ ఉండవచ్చని టాటా వర్గాలు సూచిస్తున్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే, టాటా మోటార్స్ తాజా తరం మోడల్స్‌లో చూపిస్తున్న హై-క్వాలిటీ ఫినిష్, డిజిటల్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అనేక ఆధునిక ఫీచర్లు ఇందులో ఉండే అవకాశముంది.
ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. టాటా ఇప్పటికే EV సెగ్మెంట్‌లో దేశంలో అత్యధిక మార్కెట్ షేర్ కలిగి ఉన్నందున, సియారాను కూడా ఫ్యూచర్ EV ప్లాట్‌ఫార్మ్‌పై తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లు కూడా లభించవచ్చని చర్చ జరుగుతోంది.
టాటా సియారా మళ్లీ రావడం అంటే కేవలం ఒక SUV రీ-ఎంట్రీ మాత్రమే కాదు, ఒక తరం నాటి నస్టాల్జియాకు మళ్లీ రూపం దిద్దినట్టే. ఓల్డ్ స్కూల్ SUV ప్రేమికులకు ఇది ఎమోషనల్ డ్రైవ్‌గా మారబోతోంది. మరోవైపు కొత్త తరం కస్టమర్లకు ఆధునిక స్టైల్, టెక్ ఫ్రెండ్లీ ఫీచర్లతో ఒక కొత్త అనుభవాన్ని అందిస్తుంది. టాటా బ్రాండ్ ప్రెస్టీజును మరింత పెంచే కీలక మోడల్‌గా కూడా సియారాను కంపెనీ చూస్తోంది. నవంబర్ 25న ధరలు, వేరియంట్లు, స్పెసిఫికేషన్లు అధికారికంగా బయటకు వచ్చే వరకు ఆటో మార్కెట్ మాత్రంఈ SUV కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.