వారణాసి ఈవెంట్ సందర్భంగా దర్శకులు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి కారణమయ్యాయి. నిన్న జరిగిన ఈ మహా ఈవెంట్‌లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదలలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో కొద్ది నిమిషాల పాటు కార్యక్రమం ఆగిపోయింది. ఈ సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ, “నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. మా నాన్నగారు హనుమాన్ వెనకాల ఉంటాడని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఈ టెక్నికల్ గ్లిచ్ జరిగిన వెంటనే నాకు కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది అని అనిపించింది” అని వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు కొందరికి సరదాగా అనిపించినా, భారీగా నెటిజన్ల విమర్శలపాలయ్యాయి.
అంతకుముందు SSMB29 ఈవెంట్‌లో రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, “ఈ సినిమా చేయడానికి హనుమాన్ స్వయంగా రాజమౌళి వెనక నించింది. ఈ ప్రయాణం ఓ దైవసంకల్పం లాంటిది” అని చెప్పడం జరిగింది. దీనితో అభిమానుల్లో భక్తి పరమైన అంచనాలు పెరిగాయి. అయితే వెంటనే రాజమౌళి చేసిన సంభాషణ ఆ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. “చిన్న టెక్నికల్ సమస్య వచ్చిన వెంటనే దేవుడిని ఎందుకు ప్రస్తావించాలి? అలాంటి జోకులు ఎందుకు చేయాలి?” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొందరు రాజమౌళి మాటల్లో అసహనం, అతి విశ్వాస నిరాకరణ కనిపించిందని, భక్తులకు కించపరిచేలా మాట్లాడారని కామెంట్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో #RespectHanuman, #RajamouliStatements వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది రాజమౌళిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు: “మీరు నమ్మినా, నమ్మకపోయినా దేవుళ్లపై ఆడుకునేలా మాట్లాడటం ఏమిటి?” అని. ఇక మరికొందరు మాత్రం రాజమౌళిని సమర్థిస్తున్నారు. ఆయన మాటలను తప్పుగా వింటున్నారని, అది కేవలం టెక్నికల్ ఇబ్బందులపై వచ్చిన కోపం మాత్రమేనని వివరిస్తున్నారు. కానీ మొత్తం మీద ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి.
‘వారణాసి’ ఈవెంట్ గ్రాండ్‌గా జరగడంతో పాటు మహేష్ బాబు లుక్, పోస్టర్, సినిమా కాన్సెప్ట్ పై మంచి స్పందన వచ్చింది. అయితే ఈ కామెంట్ వివాదం ఈ ఈవెంట్ ఆకర్షణను కొంత మేర దెబ్బతీసింది. అభిమానులు మాత్రం రాజమౌళి వివరణ ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఈ వివాదం సినిమాకు మరింత ప్రచారం తీసుకురాగలదని కొందరు భావిస్తున్నారు. ఏదేమైనా ‘వారణాసి’ చిత్రం ప్రారంభం నుంచే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు రాజమౌళి కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారడంతో సినిమా పై మరింత దృష్టి పడటం ఖాయం.