బిగ్‌బాస్ షోలో 'ఫ్యామిలీ వీక్' వచ్చిందంటే.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్ల కన్నా బయటున్న ఆడియన్సే ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత తమ ఫ్యామిలీ మెంబర్స్‌ని హౌస్‌మేట్స్ చూసేటప్పుడు కలిగే భావోద్వేగాలు, ఆ కన్నీళ్లు, మాట్లాడే మాటలు అన్నీ చాలా రియల్‌గా ఉంటాయి. అందుకే ఈ ఎపిసోడ్‌లకు రేటింగ్ కూడా భారీగా వస్తుంది.
అయితే, ఈసారి సీజన్-9 రేటింగ్ మరీ దారుణంగా పడిపోవడంతో.. ఫ్యామిలీ వీక్‌ను అత్యంత ఎమోషనల్‌గా ప్లాన్ చేయడానికి బిగ్‌బాస్ టీమ్ ఒక పెద్ద స్కెచ్ వేసినట్లు కనిపిస్తుంది. ఆడియన్స్‌ని టీవీలకి అతుక్కునేలా, ఎమోషన్‌తో గుండెల్ని పిండేయడానికి ఈ వీకెండ్ ఎపిసోడ్‌లోనే ఆ స్కెచ్ మొదలుపెట్టారు.
శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున.. హౌస్ మీద బిగ్‌బాస్ రెండు 'బిగ్ బాంబ్స్' వేయబోతున్నారని షాకిచ్చారు. డబుల్ ఎలిమినేషన్. ఈ రెండో బాంబ్ ఎవరిపై పడుతుందో తెలుసుకునేందుకు హౌస్‌మేట్స్‌కి చిన్న టాస్క్ పెట్టారు.
హౌస్‌లో తమకి మోస్ట్ సపోర్టివ్ ఎవరు, మరియు తమ ఆటను కిందకి లాగేదెవరు అంటూ ప్రతి ఒక్కరూ రెండు పేర్లు చెప్పాల్సి ఉంటుంది. ఇందులో అత్యధికంగా నలుగురు హౌస్‌మేట్స్.. సంజన వల్ల తమ ఆట కిందకి పోతుంది అంటూ అభిప్రాయపడ్డారు.
దీంతో నాగార్జున ఆ రెండో బాంబ్ సంజన మీద పడుతుందని అన్నారు. తీరా ఓపెన్ చేసి చూస్తే అందులో భయంకరమైన మాట రాసి ఉంది: 'నో ఫ్యామిలీ వీక్'!
ఈ మాట చూడగానే సంజన తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఎందుకంటే సంజనకి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. అందులోనూ నెలల పసికందును ఇంట్లో వదిలేసి షోకి వచ్చింది. ప్రతిరోజూ తన పిల్లల్ని, భర్తని చూడొచ్చని ఆమె ఎంతో ఆశగా వెయిట్ చేస్తుంది. అలాంటి సంజనకి 'నో ఫ్యామిలీ వీక్' అంటే పరిస్థితి ఊహించవచ్చు.
సంజన కన్నీళ్లు పెట్టుకుంటూ నాగార్జునను వేడుకుంది: "సార్ నేను ఇంటికెళ్లిపోతాను సార్.. నా వల్ల కాదు.. నేను చచ్చిపోతా.. నో సార్ నేను వెళ్లిపోతా.. నాకు ఈ గేమ్ ఇష్టం, మిమ్మల్ని ప్రతి వారం చూడటం ఇష్టం, కానీ నేను ఇక ఉండలేను సార్.. రోజుకు ఆరుసార్లు ఏడుస్తున్నాను.. ప్లీజ్ నన్ను ఇంటికి పంపించేయండి సార్.. నేను అంత బ్యాడ్ ఎవరికీ ఇక్కడ చేయలేదు సార్.."
దానికి నాగార్జున.. "ఇది నీ మూలంగా జరిగింది కాదు. హౌస్‌లో మెజారిటీ నీ మూలంగా వాళ్ల ఆట మునిగిపోతుందన్నారు. ఇది బిగ్‌బాస్ నిర్ణయం, రిజల్ట్‌ని మనం ఊహించలేం," అని అన్నారు.
సంజన పరిస్థితి చూసిన కళ్యాణ్ వెంటనే చేయి ఎత్తి.. "సార్ ఏదైనా ఛాన్స్ ఉంటే నేను నా ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తా సార్.. ఆ బిగ్ బాంబ్ నేను తీసుకుంటాను," అని అన్నాడు. ఆ తర్వాత భరణి కూడా లేచి, అవకాశం ఉంటే సంజనకు ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు.
దీనికి నాగార్జున స్పందిస్తూ, "మీ ఫ్యామిలీ వీక్ త్యాగం చేస్తే సంజనకి ఫ్యామిలీ వీక్ ఇవ్వొచ్చని బిగ్‌బాస్ చెప్పలేదు. సంజన.. ఇది బిగ్‌బాస్ హౌస్.. ఇక్కడ ఊహించనవి జరుగుతాయి.. నువ్వు ఓపిక పట్టు," అని ఆమెను శాంతపరిచారు.
ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్‌కి మాత్రం ఇదంతా ఖచ్చితంగా రేటింగ్ కోసమే అనే ఆలోచన రాక మానదు. గతంలో కూడా బిగ్‌బాస్ టీమ్ ఇదే ఫార్ములాను వాడింది.
గతంలో టేస్టీ తేజకి కూడా ఇలానే చేశారు. హౌస్‌లోకి తన తల్లిని తీసుకురావడం తన కల అని తేజ ఎన్నోసార్లు చెప్పడంతో, దానిపైనే దెబ్బేసేలా 'నో ఫ్యామిలీ వీక్' అని అనౌన్స్ చేశారు. అప్పుడు తేజ ఏడ్చిన ఏడుపు అంతా ఇంతా కాదు. చివరిలో మాత్రం అతనికి కూడా అవకాశం ఇస్తూ తన తల్లిని హౌస్‌లోకి పంపించారు.
ఇప్పుడు సేమ్ సంజన విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది. ఆమెను వీలైనంత ఎమోషనల్ చేసి, చివరిలో కన్ఫార్మ్ ఛాన్స్ ఇచ్చి, ఫ్యామిలీని రప్పించొచ్చు. అందుకే, ఇమ్మానుయేల్ కూడా.. "అమ్మా నువ్వు కంగారు పడకు.. ఏడవకు.. ఫ్యామిలీ వీక్ ఖచ్చితంగా ఉంటుంది," అంటూ ముందే ధైర్యం చెప్పాడు.
సంజన ఎమోషన్ నిజమైనప్పటికీ, హౌస్ రేటింగ్ పడిపోతున్న సమయంలో ఇలాంటి ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం. బిగ్‌బాస్ ప్లాన్ ఏంటో చూడాలి!