సౌదీ అరేబియాలో జరిగిన భయానక బస్సు ప్రమాదం హైదరాబాద్‌లో ఒక్కసారిగా విషాదాన్ని నింపేసింది. ఈ ఘటనలో మృతి చెందిన వారంతా హైదరాబాద్‌కు చెందిన వారే కావడం, ముఖ్యంగా రాంనగర్‌లో నివసించే నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది ఒకేసారి మరణించడం ఊహించలేని విషాదాన్ని తెచ్చిపెట్టింది. నసీరుద్దీన్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో భక్తిశ్రద్ధలతో ఉమ్రా యాత్రకు బయల్దేరారు. ఐతే ఈ పవిత్ర యాత్ర భయంకర దుర్ఘటనకు దారితీయడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
ఈ ప్రమాదం వివరాలు బయటకు రావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, పరిచయస్తులు షాక్‌కు గురయ్యారు. నసీరుద్దీన్ కుటుంబం ఎప్పుడూ కలిసి ఉండే, పెద్ద కుటుంబంగా అందరం చూసేదిగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఉమ్రా యాత్రకు వెళ్లడం కూడా వారందరి కోరికతోనే నిర్ణయించారని తెలుస్తోంది. అయితే ఆ కోరిక చివరకు ప్రాణాంతకంగా మారి మొత్తం కుటుంబాన్నే ముంచేసింది. బస్సు నియంత్రణ కోల్పోయి ప్రమాదానికి గురైన సమయంలో ఎవరికి ఎలాంటి అవకాశం లేకుండా చాలా వేగంతో జరిగిన ఈ ఘటనలో బతికి బయటపడేందుకు అవకాశం లేకుండా పోయింది.
ఇంత పెద్ద సంఖ్యలో ఒకే కుటుంబానికి చెందిన వారంతా క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడం అరుదైన విషాదంగా నమోదైంది. ఈ ఘటన గురించి వారి బంధువులు మాట్లాడుతూ నసీరుద్దీన్ కుమారుడు సిరాజుద్దీన్ మాత్రమే జీవించి ఉన్నాడని, అతడు ఉద్యోగరీత్యా ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో యాత్రకు రాలేదని తెలిపారు. ఇప్పుడు అతడే మొత్తం కుటుంబానికి మిగిలిన ఏకైక సభ్యుడు కావడం హృదయం పగిలే విషయమని కన్నీళ్లతో వివరించారు.
సౌదీ ప్రభుత్వంతో పాటు భారత రాయబార కార్యాలయం కూడా సమాచారం అందుకుని అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. మరణించిన వారి అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలా? లేక కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు భారత్‌కు రవాణా చేయాలా? అన్న విషయంపై చర్చలు జరుగుతున్నాయి.
ఈ ప్రమాదం హైదరాబాద్‌లోని రాంనగర్ ప్రాంతాన్ని నిశ్శబ్దంలోకి నెట్టేసింది. ఒక్కింటిలోనే 18 దీపాలు ఆరిపోవడంతో వాతావరణం మరింత విషాదకరంగా మారింది. స్థానికులు, పరిచయస్తులు, స్నేహితులు ఇంటి వద్ద గుమిగూడి కుటుంబానికి జరిగిన అనర్థాన్ని నమ్మలేకపోతున్నారు. ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదని, కుటుంబం మొత్తాన్ని ఇలా కోల్పోవడం చాలా పెద్ద దుర్ఘటనగా భావిస్తున్నారు.
మనసులో మిగిలేది ఒక్క ప్రశ్నే ఒక కుటుంబం మొత్తం ఇలా క్షణాల్లో ఎలా మాయమవుతుంది? అవమానాలు, కోరికలు, ఆనందాలు, ఆశలు అన్నీ ఒక్క దెబ్బకు ముగిసిపోయాయి. ఈ ఘటనను గుర్తు చేసుకునే ప్రతిసారి హృదయం కలవరపడకుండా ఉండదు.