విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ సదస్సు ఈసారి అద్భుతమైన స్పందనను నమోదు చేస్తోంది. మొత్తం 60 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, అంతర్జాతీయ కార్పొరేట్లు, ఇన్వెస్టర్లు ఈ సదస్సుకు హాజరవడం విశేషం. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఏపీ ప్రభుత్వం 613 ఎంవోయూలు కుదుర్చుకుని రాష్ట్ర అభివృద్ధికి భారీ ప్రోత్సాహం లభించింది. ఈ ఎంవోయూల ద్వారా సుమారు రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి రానుండగా, వేలాది ఉద్యోగాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడి చేశారు. రాష్ట్ర పెట్టుబడి వాతావరణంపై ఇన్వెస్టర్ల విశ్వాసం పెరిగిందనే సంకేతాలను ఈ సదస్సు ఇస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ సందర్భంలో ప్రముఖ దుస్తుల తయారీ దిగ్గజం రేమండ్ గ్రూప్, ఏపీలో రూ.1201 కోట్ల భారీ పెట్టుబడి ప్రకటించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాయలసీమలో మూడు పెద్ద ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి గ్రూప్ ముందుకు రావడంతో, ఆ ప్రాంత అభివృద్ధికి ఇది పెద్ద బూస్ట్‌గా మారనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. అపారెల్, ఆటోమొబైల్, ఏరోస్పేస్ రంగాల్లో రేమండ్ మూడు యూనిట్లు ఏర్పాటు చేస్తుండటం రాష్ట్ర పారిశ్రామిక వైవిధ్యాన్ని మరింత పెంచనుందని ప్రభుత్వం భావిస్తోంది. 2027 నాటికి ఈ మూడు యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేయనున్నట్లు సీఎం ప్రకటించారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాయలసీమలో పరిశ్రమల దశ తిరగబోతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే కియా మోటార్స్‌తో రాయలసీమకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని, త్వరలోనే డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, డిఫెన్స్ కారిడార్లు ఈ ప్రాంతంలో రూపుదిద్దుకోనున్నాయని ప్రకటించారు. విమానప్రయాణాలు పెరుగుతున్న నేపథ్యంలో ఏరోస్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్‌కి విపరీత డిమాండ్ ఏర్పడుతోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ ముందంజలో ఉందని గుర్తుచేశారు. విశాఖపట్నాన్ని వరల్డ్ డేటా సెంటర్‌గా అభివృద్ధి చేసే యోచనలో ఉన్నామని, పర్యాటక రంగం కూడా వేగంగా ఎదుగుతోందని చంద్రబాబు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని త్వరలోనే అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.
రేమండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ మయానీ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సౌకర్యాలు కారణంగానే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. రాప్తాడులో రూ.497 కోట్లతో అపారెల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ ఏర్పాటుకు సిద్ధమవుతుండగా, అనంతపురం జిల్లాలోని గుడిపల్లిలో రూ.441 కోట్లతో ఆటో కాంపోనెంట్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టేకులోడు వద్ద రూ.262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా మొత్తం 6,500 మందికి పైగా స్థానికులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయని మయానీ తెలిపారు.