దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేగంగా మారుతోంది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను శనివారం నాటికి మరింత బలపడుతూ, ఆదివారం తెల్లవారుజామున తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ప్రజలు అత్యవసర పరిస్థితులప్పుడు మాత్రమే బయటకు రావాలని, వీలైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తుఫాను ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కారైకాల్‌కు 150 కి.మీ, పుదుచ్చేరికి 250 కి.మీ, చెన్నైకి 350 కి.మీ దూరంలో దిత్వా కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ వేగం, దిశ కొనసాగితే ఆదివారం తెల్లవారుజామున తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలను తాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో గాలి వేగం పెరిగే అవకాశం ఉండడంతో మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రైతులు కూడా పంటలను రక్షించుకునే చర్యలు తీసుకోవాలని సూచించారు.
దిత్వా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో తుఫాను తీవ్రత, దాని ప్రభావం, ముందస్తు చర్యలపై విపులంగా చర్చించారు. తుఫాను మార్గం, వర్షాలు, గాలివేగం వంటి వివరాలను రియల్‌టైమ్‌లో విశ్లేషిస్తూ ప్రభావిత జిల్లాలకు వెంటనే హెచ్చరికలు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలో ఉన్న పరిస్థితులను పరిశీలించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తీర ప్రాంతాల్లోని బలహీన ప్రాంతాలను గుర్తించి ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు. వర్షాలు అధికంగా పడే జిల్లాల్లో విద్యుత్, రోడ్లు, కమ్యూనికేషన్ వంటి అత్యవసర సేవలను అంతరాయం కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పనిచేయాల్సి ఉంది. ప్రభుత్వం మొత్తం యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతతో పని చేస్తున్నట్లు మంత్రి అనిత హామీ ఇచ్చారు.