నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను ప్రస్తుతం శ్రీలంక తీరాన్ని ఆనుకుని కొనసాగుతోంది. ఈ తుపాను ప్రస్తుతం కారైకాల్కు 220 కి.మీ, పుదుచ్చేరికి 330 కి.మీ, చెన్నైకి 430 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గత 6 గంటల్లో ఇది గంటకు 7 కి.మీ వేగంతో ముందుకు కదిలింది.
తాజా అంచనాల ప్రకారం, ఈ తుపాను రేపు తెల్లవారుజామున తీవ్ర వాయుగుండం రూపంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. తుపాను తీరానికి చేరువయ్యే సమయంలో గాలివేగం పెరగడం, వర్షాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ తుపాను ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా వానలు పెరిగే అవకాశాన్ని కూడా అధికారులు సూచిస్తున్నారు.
అంతేకాక, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గాలులు పెరిగే అవకాశం ఉండడంతో కొన్ని ప్రాంతాల్లో జాగ్రత్తలు అవసరం అని పేర్కొన్నారు.
తుపాను ప్రభావం దృష్ట్యా మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీయ్యాయి. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అవసరమైతే స్థానిక అధికారుల సూచనలను అనుసరించాలని సూచించారు.