ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోయాయి. శనివారం ఉదయం నుంచే రాష్ట్రంలోని పలు చోట్ల వానలు ప్రారంభమయ్యాయి. శ్రీసత్య సాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో ముఖ్యంగా రైతుల్లో కొంత ఆందోళన ఏర్పడింది.
అనంతపురం, నంద్యాల జిల్లాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమవడంతో ఎప్పుడైనా వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మార్పులన్నీ ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగానే చోటు చేసుకున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సముద్రం వైపు నుంచి వచ్చే తేమగాలులు రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ వాతావరణ మార్పు మరింత వేగంగా చోటు చేసుకుంటుందని వారు వివరిస్తున్నారు.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ APSDMA ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టంగా పేర్కొంది. బుధవారం నాటికి ఇది తీవ్ర తుఫాను రూపం దాల్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే, రాబోయే కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే కొన్ని మండలాల్లో మోస్తరు వానలు కురవడంతో, వ్యవసాయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో పంట కోతలు ప్రారంభమవుతున్న సమయంలో వర్షాలు రావడం రైతుల్లో ఆందోళనను మరింత పెంచింది