తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించిన తాజా వివరాలను టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు. శుక్రవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో దాదాపు 83 వేల మందికి స్వామివారి దర్శనం కల్పించామని ఆయన తెలిపారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా దర్శనాలు సజావుగా నిర్వహించగలిగామని చెప్పారు. టీటీడీ అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయిలో దర్శనాలు సాధ్యమయ్యాయని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేకత ఏమిటంటే, శుక్రవారం అభిషేక సేవలో పాల్గొన్న భక్తులతో పాటు సర్వదర్శన భక్తులకూ సమయానికి దర్శనం కల్పించగలిగామని వెంకయ్య చౌదరి తెలిపారు. సాధారణంగా అభిషేక సేవలు ఉన్న రోజుల్లో సర్వదర్శనానికి ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ముందస్తు ప్రణాళికలు, క్యూలైన్ల సమర్థ నిర్వహణ వల్ల రెండు రకాల భక్తులకూ ఇబ్బందులు తలెత్తలేదని ఆయన వివరించారు.
వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తొలి మూడు రోజుల పాటు టోకెన్లు పొందిన భక్తులు టీటీడీకి పూర్తిగా సహకరించారని ఈవో తెలిపారు. భక్తులు తమకు కేటాయించిన సమయానికి ప్రవేశ మార్గాల వద్దకు చేరుకోవడం వల్ల క్యూలైన్లు సాఫీగా కదిలాయని చెప్పారు. సమయపాలన పాటించడం వల్ల పెద్ద ఎత్తున రద్దీ ఉన్నప్పటికీ పరిస్థితి అదుపులోనే ఉండిందని అధికారులు చెబుతున్నారు.
నిన్నటి నుంచి టోకెన్లు లేని భక్తులకు కూడా ఉత్తర ద్వారం ద్వారా దర్శనం కల్పిస్తున్నామని వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రారంభంలో రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, క్రమంగా భక్తుల సంఖ్య తగ్గడంతో ఇప్పుడు కృష్ణ తేజ సర్కిల్ నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నట్లు అదేవిధంగా రద్దీని బట్టి ప్రవేశ మార్గాలను మార్చుతూ భక్తులకు సౌకర్యంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ క్యూలైన్లను సర్దుబాటు చేస్తున్నామని ఎక్కడ రద్దీ పెరిగితే అక్కడ అదనపు సిబ్బందిని నియమించడం, అవసరమైతే ప్రవేశ దారులను మార్చడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని వల్ల భక్తులు ఎక్కువ సేపు క్యూలైన్లో నిలబడకుండా త్వరగా దర్శనం చేసుకునే అవకాశం కలుగుతోందన్నారు.
తిరుమలలో దర్శనాల నిర్వహణలో జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసులు, విజిలెన్స్ విభాగం కీలక పాత్ర పోషిస్తున్నాయని వెంకయ్య చౌదరి అన్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా అధికారులు, సిబ్బంది విధుల్లో కొనసాగుతూ భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారని చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి క్యూలైన్ పర్యవేక్షణ వరకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
శనివారం మధ్యాహ్నం 1 గంటల వరకు ఇప్పటికే 33 వేల మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారని అధికారులు వెల్లడించారు.