నిన్న మంత్రి శ్రీ కొండపల్లి గారిని కలవడానికి తెనాలికి చెందిన ఒక యువతి వచ్చింది. ఆమె బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. తనకు ఉన్న ఒక ప్రత్యేకమైన ఐడియాను ప్రభుత్వానికి చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటోంది. ఎవరి సహాయం లేకుండా, తానే ఒంటరిగా వచ్చి, తన ఆలోచనలను ఒక బుక్‌లెట్‌లో డిజైన్ చేసి తీసుకువచ్చింది. లింక్డ్ ఇన్ ద్వారా మంత్రి గారికి రిక్వెస్ట్ పంపగా, ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు.
ఆ యువతి తన ఐడియాను వివరించిన తీరు అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. జపాన్, జర్మనీ టెక్నాలజీలతో తాను చేస్తున్న పనిని, ఏపీ ప్రభుత్వంతో కలిసి ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటుందో స్పష్టంగా చెప్పింది. “స్టూడెంట్ టు లీడర్” (Student To Leader) అనే ఎకో సిస్టం నిర్మించడం తన లక్ష్యమని చెప్పి, విద్యార్థులను నాయకులు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే దృక్పథాన్ని వివరించింది.
చదువుకుంటూనే ఆమె ఒక చిన్న కంపెనీని కూడా ప్రారంభించింది. తన కాలేజీ నుంచి పూర్తి సహకారం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో టీ-హబ్ ద్వారా పని చేస్తూ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తన కార్యకలాపాలను విస్తరించాలని కోరుకుంటోంది. కొత్త ఆవిష్కరణలు, రీసెర్చ్, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం, సహజ ఉత్పత్తుల మార్కెటింగ్ వంటి అంశాలపై తన ప్రణాళికలను మంత్రి గారికి వివరించింది.
మంత్రి కొండపల్లి గారు ఆమె ఆలోచనలను శ్రద్ధగా విని, చాలా సానుకూలంగా స్పందించారు. ఏం చేయాలో సూచనలు ఇచ్చారు, ఆమె అడిగిన విషయాలకు కూడా ప్రోత్సాహం ఇచ్చారు. ఆమె తన తల్లితో కలిసి కొన్ని ఉత్పత్తులను విదేశాలకు కూడా పంపుతుందని తెలుసుకుని మంత్రి గారు మరింత ఆశ్చర్యపోయారు.
ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచిన విషయం ఆమె వయసు – సుమారు 20 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచన, స్పష్టమైన లక్ష్యం, ఎవరిని కలిస్తే తన ఐడియా ముందుకు వెళ్తుందో గుర్తించి ప్రయత్నించడం నిజంగా అభినందనీయం. ఆమె భద్రత కోసమే ఫోటో బయట పెట్టలేదని చెప్పబడింది. సరైన నాయకత్వం, సరైన దృక్పథం ఉంటే సమాజానికి ఎంత ఉపయోగం అవుతుందో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది.