చాలామంది గురకను (Snoring Health Risk) ఒక చిన్న సమస్యగా మాత్రమే తీసుకుంటారు. గాఢ నిద్రపోతే గురక రావడం సహజమేనని, దాంతో పెద్దగా నష్టం ఏమీ ఉండదని చాలామంది భావిస్తుంటారు. అయితే వైద్య నిపుణులు చెబుతున్న తాజా అధ్యయనాలు ఈ ఆలోచన పూర్తిగా తప్పేనని స్పష్టం చేస్తున్నాయి. నిద్రలో వచ్చే ఆ భారీ శబ్దం కేవలం అలసటకు సంకేతం కాదు, అది మీ గుండె ఆరోగ్యానికి ప్రమాద ఘంటిక కావచ్చని హెచ్చరిస్తున్నారు.
నిపుణుల వివరాల ప్రకారం, బిగ్గరగా మరియు తరచుగా వచ్చే గురక వెనుక ఒక తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్య దాగి ఉండే అవకాశాలు ఎక్కువ. నిద్రపోతున్న సమయంలో శ్వాసనాళం పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోవడం వల్ల గాలి సరిగా లోపలికి వెళ్లదు. దాంతో ఊపిరి తీసుకోవడంలో అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమయంలో శరీరానికి, ముఖ్యంగా మెదడుకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఆక్సిజన్ స్థాయి పడిపోవడం (Heart Attack Risk)
గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు.
నిద్రలో ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే శరీరం ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టుగా భావిస్తుంది. వెంటనే స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది, రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఈ పరిస్థితి తరచూ జరిగితే గుండెపై ఒత్తిడి పెరిగి, దీర్ఘకాలంలో గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. కొందరిలో గుండె స్పందనల్లో తీవ్రమైన తేడాలు రావడం వల్ల నిద్రలోనే గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్ని రకాల (Night Snoring Problems) గురకలు ప్రమాదకరం కావు. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. గురక చాలా బిగ్గరగా ఉండటం, మధ్యమధ్యలో శ్వాస ఆగిపోయినట్టుగా అనిపించడం, ఉలిక్కిపడి నిద్రలేవడం వంటి లక్షణాలు కనిపిస్తే అది సాధారణ సమస్య కాదని గుర్తించాలి. రాత్రి ఎక్కువ సేపు నిద్రపోయినా పగటిపూట నిద్రమత్తుగా ఉండటం, ఉదయం లేవగానే తలనొప్పిగా ఉండటం, ఏ పనిలోనూ ఉత్సాహం లేకపోవడం వంటి లక్షణాలు కూడా ప్రమాద సంకేతాలుగా భావించాలి.
ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా సమయానికి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. వైద్యుల సూచనల మేరకు కొన్ని జీవనశైలి మార్పులు చేస్తే పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా (Cardiac Health Awareness) బరువు ఎక్కువగా ఉన్నవారిలో మెడ చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల శ్వాసనాళంపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి బరువు తగ్గడం వల్ల గురక తీవ్రత తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే వెల్లకిలా పడుకోవడం కంటే పక్కకు తిరిగి పడుకోవడం వల్ల గాలి మార్గం సాఫీగా ఉండే అవకాశం ఉంటుంది.
నిద్రపోయే (Sleep Apnea Symptoms) ముందు మద్యం సేవించడం, పొగతాగడం వంటి అలవాట్లు కూడా గురకను పెంచుతాయి. అందుకే వీటిని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నవారికి ప్రత్యేక పరికరాల సహాయంతో నిద్రలో ఆక్సిజన్ సరఫరా చేసే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవి గుండెపై పడే ఒత్తిడిని తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయని చెబుతున్నారు.