భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంపై వైసీపీ (YSRCP) చేస్తున్నది అభివృద్ధి రాజకీయాలు కాదు, స్పష్టమైన క్రెడిట్ చోరీ రాజకీయాలేనని కూటమి ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram airport ) వెనుక వైసీపీకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకపోయినా, అంతా తామే చేసినట్టు చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ (Pattabhiram) స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, దశలవారీగా భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిందని, ఆ అభివృద్ధి క్రెడిట్‌ను నిస్సిగ్గుగా వైసీపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. జగన్‌కు ఉన్నది క్రిమినల్ క్రెడిట్ చరిత్ర మాత్రమేనని, దాన్ని ఎవరూ చోరీ చేయలేరని, చంద్రబాబుకు ఉన్నది డెవలప్మెంట్ క్రెడిట్ అని, ఫేక్ ట్వీట్లతో ఆ స్థాయికి కూడా జగన్ చేరలేడని పట్టాభిరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు చరిత్రను పరిశీలిస్తే, అసలు వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తాయని ఆయన తెలిపారు. 20-05-2015న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV) ఏర్పాటు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబర్ 63ను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత 27-01-2016న కేంద్ర ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు సైట్ క్లియరెన్స్ ఇచ్చిందని, ఈ కీలక అనుమతిని తీసుకువచ్చిన ఘనత పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. అలాగే 09-06-2016న భూ నిర్వాసితులకు న్యాయమైన, ఉదారమైన పరిహారం అందించేందుకు జీవో నెంబర్ 64ను చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. రైతులకు నష్టం కలగకుండా భూసేకరణ చేపట్టడం, ప్రజల ఆమోదంతోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం చంద్రబాబు పాలన ప్రత్యేకత అని వివరించారు.
భోగాపురం విమానాశ్రయ అంకురార్పణ కూడా చంద్రబాబు నాయుడే చేశారని, ప్రాజెక్టు వేగవంతం కావడానికి 2017లోనే స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. 07-10-2016న కేంద్ర ప్రభుత్వం ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చిందని, 14-08-2017న కీలకమైన పర్యావరణ అనుమతులు తెచ్చి నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించింది కూడా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అయితే ఆ సమయంలో విమానాశ్రయం అవసరమా అంటూ వైసీపీ అడ్డుకుందని, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని బహిరంగంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే వైసీపీ అనుమతులు తామే తెచ్చామని అవాస్తవాలు ప్రచారం చేయడం ప్రజల తెలివిని అవమానించడమేనని పట్టాభిరామ్ మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం మరింత వేగం పుంజుకుందని, అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఆరు నెలల ముందే, అంటే 2026 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలకు బాగా తెలుసని, ఫేక్ ప్రచారాలతో చరిత్రను మార్చలేరని, భోగాపురం ఎయిర్‌పోర్టు చంద్రబాబు విజన్‌కు నిదర్శనమని పట్టాభిరామ్ స్పష్టంగా పేర్కొన్నారు.