ప్రపంచ వేదికపై భారతీయ రుచుల సత్తా.. టాప్ 50లో రెండు రెస్టారెంట్లు!

India's Best Restaurants 2026: భారతీయ వంటకాలకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ 50 రెస్టారెంట్ల జాబితా (World’s 50 Best Restaurants 2026)లో భారత్‌కు చెందిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో ముంబైకి చెందిన మాస్క్ (Masque), హిమాలయాల సమీపంలోని నార్ (Naar) రెస్టారెంట్లు స్థానం సంపాదించాయి. ఒకే ఏడాది రెండు భారతీయ రెస్టారెంట్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నిలవడం విశేషం.

India's Masque and Naar Shine in World's 50 Best Restaurants 2026
India's Masque and Naar Shine in World's 50 Best Restaurants 2026
  • ప్రపంచంలోని 50 అత్యుత్తమ రెస్టారెంట్ల జాబితాలో భారత్‌లోని ముంబై, హిమాలయాల రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి.
  • ముంబైలోని మాస్క్ రెస్టారెంట్ 26వ స్థానం సాధించగా, హిమాలయాల సమీపంలోని నార్ రెస్టారెంట్ 49వ స్థానంలో నిలిచింది.

India's Best Restaurants 2026: భారతీయ వంటకాలకు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ప్రపంచంలోని అత్యుత్తమ 50 రెస్టారెంట్ల జాబితా (World’s 50 Best Restaurants 2026)లో భారత్‌కు చెందిన రెండు రెస్టారెంట్లు చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో ముంబైకి చెందిన మాస్క్ (Masque), హిమాలయాల సమీపంలోని నార్ (Naar) రెస్టారెంట్లు స్థానం సంపాదించాయి. ఒకే ఏడాది రెండు భారతీయ రెస్టారెంట్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో నిలవడం విశేషం.

స్పెయిన్ రెస్టారెంట్‌కు తొలి స్థానం

పెరూలోని లిమా నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచంలోని 50 ఉత్తమ రెస్టారెంట్ల ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. ఈసారి స్పెయిన్‌కు చెందిన అసడోర్ ఎట్జెబర్రి (Asador Etxebarri) మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. బాస్క్ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలో ఉన్న ఈ రెస్టారెంట్ గ్రిల్ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

26వ స్థానంలో ముంబైకి చెందిన మాస్క్

భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న రెస్టారెంట్లలో ముంబైకి చెందిన మాస్క్ ఒకటి. ఇది 26వ స్థానంలో నిలిచింది. చెఫ్ వరుణ్ తోట్లాని ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ రెస్టారెంట్ తొలిసారిగా ప్రపంచ టాప్ 50 జాబితాలోకి ప్రవేశించింది.

ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో పాత టెక్స్‌టైల్ మిల్లు భవనంలో ఈ రెస్టారెంట్ ఉంది. సంప్రదాయ భారతీయ వంటకాలను ఆధునిక పద్ధతుల్లో, సరికొత్త రుచులతో అందించడం దీని ప్రత్యేకత.

49వ స్థానంలో హిమాలయాల నార్

భారత్ నుంచి ఎంపికైన రెండో రెస్టారెంట్ నార్. ఇది ప్రపంచ జాబితాలో 49వ స్థానాన్ని దక్కించుకుంది. చెఫ్ ప్రతీక్ సాధు నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్ హిమాలయాల పర్వత ప్రాంతానికి సమీపంలో ఉంది.

స్థానికంగా లభించే పదార్థాలతో పాటు, కాలానుగుణంగా మారే ప్రత్యేక మెనూను ఇక్కడ అందిస్తారు. పర్యావరణ హితమైన వంటకాలకు ప్రాధాన్యం ఇస్తున్న ఈ రెస్టారెంట్‌కు 2026 సస్టైనబుల్ రెస్టారెంట్ అవార్డు కూడా లభించింది. చండీగఢ్ నుంచి సుమారు 90 నిమిషాల ప్రయాణంతో ఈ రెస్టారెంట్‌కు చేరుకోవచ్చు.

రెండో స్థానంలో బ్యాంకాక్ రెస్టారెంట్

ఈ జాబితాలో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని గగ్గన్ (Gaggan) రెస్టారెంట్ రెండో స్థానంలో నిలిచింది. కోల్‌కతాకు చెందిన చెఫ్ గగ్గన్ ఆనంద్ నిర్వహిస్తున్న ఈ రెస్టారెంట్‌కు 2026 ఆసియాలోని ఉత్తమ రెస్టారెంట్ అవార్డు కూడా లభించింది.

అలాగే దుబాయ్‌లోని ట్రెసిండ్ స్టూడియో (Tresind Studio) 28వ స్థానాన్ని దక్కించుకుంది. చెఫ్ హిమాంశు సైనీ నేతృత్వంలోని ఈ రెస్టారెంట్‌కు మధ్యప్రాచ్యంలోని ఉత్తమ రెస్టారెంట్ అవార్డు లభించింది.

భారత్‌కు చారిత్రక గుర్తింపు

గతంలో 2004లో ఢిల్లీలోని బుఖారా రెస్టారెంట్ తొలిసారిగా ఈ ప్రపంచ స్థాయి జాబితాలో చోటు దక్కించుకుంది. అయితే 2026లో ఒకేసారి రెండు భారతీయ రెస్టారెంట్లు టాప్ 50లో నిలవడం దేశీయ ఆహార రంగానికి గర్వకారణంగా మారింది. భారతీయ సంప్రదాయ రుచులకు ఆధునిక వంటకాల శైలిని జోడిస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు లభిస్తుందని ఈ విజయాలు మరోసారి నిరూపించాయి.

Tags

Be the first to react

Latest