చాలామందికి బరువు తగ్గాలని ఉన్నా అన్నం తినడం మానేయడం కష్టంగా మారుతుంది. అయితే అన్నానికి ఉత్తమమైన ప్రత్యామ్నాయంగా అటుకులు నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. న్యూ ఇయర్ రిజల్యూషన్‌గా బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్లో అటుకులను చేర్చుకోవడం ఒక తెలివైన నిర్ణయం. సరైన వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు ఉంటే మీ లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు.
బియ్యం మరియు అటుకుల మధ్య తేడా ఏంటి?
నిజానికి బియ్యం మరియు అటుకులు రెండూ వరి నుండే వస్తాయి. కానీ బియ్యంతో పోలిస్తే అటుకులు తయారయ్యే విధానం వేరు. వరి గింజలను నానబెట్టి, ఆపై యంత్రాలతో నొక్కడం వల్ల అటుకులు తయారవుతాయి. ఈ ప్రక్రియలో అటుకులలో ఐరన్ శాతం పెరుగుతుంది మరియు ఇవి సహజ సిద్ధమైన ప్రోబయోటిక్స్‌ను కలిగి ఉంటాయి.
బరువు తగ్గడానికి అటుకులు ఎందుకు సరైనవి?
అన్నంతో పోలిస్తే అటుకులు చాలా తేలికగా జీర్ణమవుతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు. తక్కువ క్యాలరీలు - ఎక్కువ శక్తి అటుకులు తిన్న తర్వాత ఎక్కువ సేపు ఆకలి వేయదు. అతిగా తినకుండా మనల్ని నియంత్రిస్తుంది. అటుకులలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కూరగాయలు ఎక్కువగా వేసిన అటుకుల పోహా తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. రాత్రి భోజనాన్ని 8 గంటల లోపే ముగించడం మరియు తగినంత నీరు తాగడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు.
అటుకులో పోహాను తక్కువ సమయంలో ఇలా తయారు చేసుకోండి
కావలసినవి:
అటుకులు - 1 కప్పు
ఆవాలు, జీలకర్ర
పచ్చిమిర్చి 2
ఉల్లిపాయ - ఒకటి చిన్న ముక్కలు
పసుపు- చిటికెడు
ఉప్పు- తగినంత
నిమ్మరసం - అర చెక్క
తయారీ విధానం
అటుకులను ఒక జల్లెడలో వేసి నీళ్లతో ఒక్కసారి కడిగి పక్కన పెట్టండి. బాండీలో కొంచెం నూనె వేసి వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేయండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించండి. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేయండి. ఇప్పుడు తడిపి పెట్టుకున్న అటుకులను వేసి, పోపు అంతా పట్టేలా బాగా కలపండి. చివరగా మంట ఆపేసి, నిమ్మరసం పిండుకుంటే సింపుల్ పోహా రెడీ.మీరు బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాబట్టి, ఇందులో వేరుశనగ పప్పులు వేయకండి ఎందుకంటే వాటిలో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి.