ఎస్సీ వర్గాల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టుకునేలా చేయాలన్న ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్, సెర్ప్ సమన్వయంతో కొత్త రాయితీ రుణ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే లబ్ధిదారులపై వడ్డీ భారం లేకుండా రుణ సాయం అందించడం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,400 మంది ఎస్సీ లబ్ధిదారులను ఈ పథకం కింద ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ పథకానికి అవసరమైన నిధులుగా ఇప్పటికే రూ.63.26 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం అజయ్‌తో అనుసంధానం చేస్తూ దీన్ని అమలు చేయనున్నారు. జనవరి మొదటి వారంలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించి, నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఎస్సీ జనాభా శాతాన్ని ప్రామాణికంగా తీసుకుని జిల్లాల వారీగా లబ్ధిదారుల సంఖ్యను ఖరారు చేశారు.
స్వయం ఉపాధి కోసం లబ్ధిదారులు ఎంచుకునేలా ప్రభుత్వం మొత్తం 56 రకాల ఉపాధి యూనిట్లను ప్రతిపాదించింది. చిన్న వ్యాపారాల నుంచి తయారీ రంగం వరకు విస్తృత అవకాశాలు ఇందులో ఉన్నాయి. ఫుట్‌వేర్ వ్యాపారం, ప్యాసింజర్ ఆటోలు, మొబైల్ షాపులు, బేకరీలు, ఫుడ్ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి సేవారంగ ఉపాధులతో పాటు ఆర్గానిక్ ఉత్పత్తుల విక్రయాలు, జీడిపప్పు, బిస్కెట్ల తయారీ వంటి తయారీ రంగ వ్యాపారాలకూ అవకాశం కల్పించారు. ఒక్కో యూనిట్ విలువ కనీసం లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. యూనిట్ స్థాపనకు ప్రభుత్వం రూ.50 వేల వరకు రాయితీగా అందిస్తుంది.
ఈ పథకం మరో ముఖ్యాంశం ‘ఉన్నతి’ పథకంతో అనుసంధానం కావడమే. సాధారణంగా బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలకు వడ్డీ భారం తప్పదు. అయితే ఎస్సీ లబ్ధిదారులపై ఆ భారం పడకుండా చేయడానికి, సెర్ప్ పరిధిలో అమలవుతున్న ఉన్నతి పథకాన్ని ఉపయోగిస్తున్నారు. యూనిట్ విలువలో రాయితీ మినహాయించిన మిగిలిన మొత్తాన్ని డ్వాక్రా సంఘాల్లోని ఎస్సీ మహిళలకు వడ్డీ లేని రుణంగా అందిస్తారు. ఈ విధంగా లబ్ధిదారులు నెలవారీ వాయిదాల్లో రుణాన్ని చెల్లించే సౌలభ్యం కల్పించారు.
ఇదిలా ఉండగా, స్వయం ఉపాధి ప్రోత్సాహానికి సంబంధించిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్పులు చేసింది. గతంలో అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్న ఈ పథకాన్ని ఇకపై ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకే పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తయారీ రంగంలో రూ.50 లక్షల వరకు, సేవారంగంలో రూ.20 లక్షల వరకు రుణ సాయం, గ్రామీణ ప్రాంతాల్లో 35 శాతం, పట్టణాల్లో 25 శాతం రాయితీ వంటి సౌకర్యాలు కొనసాగనున్నాయి.