నిజానికి న్యూ ఇయర్ అంటే బయటకు వెళ్లి ఫ్రెండ్స్‌తో సెలబ్రేట్ చేసుకునే సమయమే. హోటళ్లు, పబ్‌లు, రోడ్లపై వేడుకలు, ఫ్యామిలీ గ్యాదరింగ్స్… ఇవే సాధారణంగా కనిపిస్తాయి. అలాంటి రోజున స్ట్రీమింగ్ ఎవరు చూస్తారు అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కానీ 2025 డిసెంబర్ 31 రాత్రి మాత్రం ఈ సాధారణ అంచనాలను తలకిందులు చేసింది. కారణం ఒక్కటే… ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కట్టిపడేసిన సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ చివరి ఎపిసోడ్.
న్యూ ఇయర్ ఈవ్ రోజున అమెరికా సమయం ప్రకారం సాయంత్రం 5 గంటలకు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఫైనల్ ఎపిసోడ్‌ను నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసింది. బయట సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పటికీ, చాలా మంది అభిమానులు మాత్రం “ఫైనల్ మిస్ అవకూడదు” అన్న ఉద్దేశంతో ఫోన్లు, టీవీల ముందే కూర్చున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్ కోసం ఒకేసారి లక్షల మంది లాగిన్ కావడంతో నెట్‌ఫ్లిక్స్ సిస్టమ్‌పై తీవ్ర ఒత్తిడి పడింది ఫలితంగా కొద్దిసేపటికి స్ట్రీమింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
ఎపిసోడ్ ప్లే చేయగానే చాలా మందికి “సమ్థింగ్ వెంట్ రాంగ్” అనే ఎర్రర్ మెసేజ్ కనిపించింది. న్యూ ఇయర్ కౌంట్‌డౌన్‌కు కొన్ని గంటల ముందే ఇలా జరగడంతో అభిమానుల్లో అసహనం వ్యక్తమైంది. సోషల్ మీడియాలో కొందరు “బయటికి వెళ్లకుండా ఫైనల్ కోసం ఇంట్లో ఉన్నాం, కానీ నెట్‌ఫ్లిక్స్ డౌన్ అయ్యింది” అంటూ కామెంట్లు పెట్టారు. మరికొందరు “ఇది స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ తప్పిదం కాదు, స్ట్రేంజర్ థింగ్స్ క్రేజ్ ఎంత ఉందో చూపించే ఉదాహరణ అంటూ స్పందించారు.
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది న్యూ ఇయర్ అయినా సరే, ఈ సిరీస్‌కు ఉన్న ఫాలోయింగ్ సాధారణం కాదు. ముఖ్యంగా ఇది చివరి సీజన్, చివరి ఎపిసోడ్ కావడంతో చాలామంది సెలబ్రేషన్స్‌ను పక్కనపెట్టి కూడా చూడడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌కు ఇది కొత్త సమస్య కాదు. గత నవంబర్‌లో ఇదే సీజన్ వాల్యూమ్–1 విడుదలైనప్పుడు కూడా కొన్ని నిమిషాల పాటు ఇలాంటి సాంకేతిక సమస్యలు వచ్చాయి. అప్పట్లో “ఐదు నిమిషాల్లో సర్వీస్ రీస్టోర్ చేశాం” అని నెట్‌ఫ్లిక్స్ చెప్పింది.
స్ట్రేంజర్ థింగ్స్ ఐదో సీజన్‌ను మూడు దశల్లో విడుదల చేశారు. నవంబర్ చివర్లో మొదటి భాగం, క్రిస్మస్ రోజున రెండో భాగం, న్యూ ఇయర్ ఈవ్ రోజున ఫైనల్ ఎపిసోడ్. ఈ ప్లానింగ్ వల్ల ప్రతి దశలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది. చివరి ఎపిసోడ్ కొన్ని థియేటర్లలో కూడా ప్రదర్శించడంతో, ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ డిమాండ్ భారీగా కనిపించింది. ఈ మొత్తం ట్రాఫిక్ ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్ సర్వర్లపై పడటం వల్లే క్రాష్ జరిగిందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.