బంగ్లాదేశ్ యువ నేత, రాజకీయ కార్యకర్త ఉస్మాన్ హాదీ హత్య కేసు రోజు రోజుకీ మరింత ఉత్కంఠను రేపుతోంది. ఈ హత్య కేసులో నిందితులు భారత్లోనే ఉన్నారంటూ ఢాకా పోలీసులు చేసిన ఆరోపణలు, అదే సమయంలో భారత భద్రతా బలగాలు వాటిని ఖండించడం, తాజాగా ఒక ప్రధాన నిందితుడు దుబాయ్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం ఈ కేసుకు కొత్త మలుపు తీసుకొచ్చాయి. దక్షిణాసియా రాజకీయ వర్గాల్లోనూ, భద్రతా సంస్థల్లోనూ ఈ పరిణామాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఢాకా పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, హాదీ హత్య కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఫైసర్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్‌లు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్లు ఆరోపించారు. స్థానికుల సహాయంతో మైమన్సింగ్ ప్రాంతంలో సరిహద్దును దాటిన ఈ నిందితులను, భారత్‌లో ‘పూర్తి’ అనే వ్యక్తి రిసీవ్ చేసుకున్నాడని ఢాకా పోలీసుల అడిషనల్ కమిషనర్ నజ్రూల్ వెల్లడించారు. అక్కడి నుంచి ‘సామీ’ అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయాలోని తురా సిటీకి తీసుకెళ్లాడని కూడా పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై భారత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, నిందితుల ఆచూకీపై స్పష్టమైన సమాచారం సేకరించే ప్రయత్నం కొనసాగుతోందని ఢాకా పోలీసులు తెలిపారు.
అయితే, ఢాకా పోలీసుల ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. మేఘాలయ పోలీసులు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సంయుక్తంగా స్పందిస్తూ, హాదీ హత్య కేసు నిందితులు భారత్లోకి ప్రవేశించినట్లు తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని స్పష్టం చేశాయి. తురా సిటీకి చేరుకున్నారన్న ప్రచారానికి కూడా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నాయి. అలాగే స్థానికులు, టాక్సీ డ్రైవర్ పాత్రపై కూడా ఇప్పటివరకు నమ్మదగిన సాక్ష్యాలు లభించలేదని స్పష్టంచేశాయి. అయితే, ఈ ఆరోపణల నేపథ్యంలో సరిహద్దుల్లో అప్రమత్తత పెంచామని, భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని BSF అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైసల్ కరీమ్ మసూద్ దుబాయ్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ఆ వీడియోలో తాను దుబాయ్‌లోనే ఉన్నానని, హాదీ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని మసూద్ స్పష్టం చేశాడు. ఢాకా పోలీసులు చేస్తున్న ఆరోపణలు అసత్యమని, రాజకీయంగా తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని అతడు వాదించాడు. ఇప్పటికే నిందితులు భారత్లోకి పారిపోయారన్న ఆరోపణలను BSF ఖండించిన నేపథ్యంలో, ఈ వీడియో మరింత గందరగోళాన్ని సృష్టిస్తోంది.
ఈ పరిణామాలన్నింటితో హాదీ హత్య కేసు అంతర్జాతీయ స్థాయికి చేరినట్టుగా కనిపిస్తోంది. ఒకవైపు ఢాకా పోలీసులు భారత్‌పై ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు భారత్ వాటిని ఖండిస్తోంది. తాజాగా దుబాయ్ వీడియో వెలుగులోకి రావడంతో బంగ్లాదేశ్‌లో యూనస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నది కీలకంగా మారింది. నిందితుల ఆచూకీపై స్పష్టత వస్తుందా? అంతర్జాతీయ సహకారంతో నిజాలు వెలుగులోకి వస్తాయా? అన్న ప్రశ్నలు ఇప్పుడందరి మదిలో మెదులుతున్నాయి. హాదీ హత్య కేసు దర్యాప్తు ఎటు మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.