రైల్వే టికెట్ రిజర్వేషన్స్ కన్ఫామ్ అవ్వలేదా? సిస్టం ఎలా పని చేస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..
Indian Railways Ticket Booking: రైలు ప్రయాణం చేయాలనుకునే చాలామంది ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకునే వారికి తరచూ వెయిటింగ్ లిస్ట్ ఎదురవుతుంది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు GNWL 10, RLWL 20, PQWL 15 లేదా TQWL వంటి స్టేటస్‌లు కనిపిస్తుంటాయి. అసలు వీటి అర్థం ఏమిటి? ఏ వెయిటింగ్ లిస్ట్ టికెట్ త్వరగా కన్ఫర్మ్ అవుతుంది? వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఏం జరుగుతుంది? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.
- టికెట్ కన్ఫర్మేషన్ అనేది కోటా, సీట్ల లభ్యత, క్యాన్సిలేషన్లపై ఆధారపడి ఉంటుంది.
- GNWL టికెట్లకు సాధారణంగా కన్ఫర్మేషన్ అవకాశాలు ఎక్కువ.. RLWL, PQWL, TQWLకు తక్కువ.
Indian Railways Ticket Booking: రైలు ప్రయాణం చేయాలనుకునే చాలామంది ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకునే వారికి తరచూ వెయిటింగ్ లిస్ట్ ఎదురవుతుంది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు GNWL 10, RLWL 20, PQWL 15 లేదా TQWL వంటి స్టేటస్‌లు కనిపిస్తుంటాయి. అసలు వీటి అర్థం ఏమిటి? ఏ వెయిటింగ్ లిస్ట్ టికెట్ త్వరగా కన్ఫర్మ్ అవుతుంది? వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న టికెట్ కన్ఫర్మ్ కాకపోతే ఏం జరుగుతుంది? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.
రైల్వే వెయిటింగ్ లిస్ట్‌కు సంబంధించి ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
వెయిటింగ్ లిస్ట్ (WL) అంటే ఏమిటి?
రైలులో అందుబాటులో ఉన్న రిజర్వేషన్ సీట్లు పూర్తిగా బుక్ అయిన తర్వాత టికెట్ బుక్ చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. ఉదాహరణకు WL 1 అంటే మీ కంటే ముందు ఒకరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారని అర్థం. అదే WL 10 ఉంటే మీ కంటే ముందు మరో 10 మంది ఉన్నట్లు లెక్క. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకుంటే వెయిటింగ్ లిస్ట్ నంబర్ తగ్గుతుంది. ఈ క్రమంలో సీటు కేటాయింపు జరిగితే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.
RAC అంటే ఏమిటి?
RAC అంటే Reservation Against Cancellation. ఇది వెయిటింగ్ లిస్ట్ కంటే మెరుగైన స్థితి. RAC టికెట్ ఉన్న ప్రయాణికులు రైలులో ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అయితే ప్రారంభంలో పూర్తి బెర్త్ కేటాయించకపోవచ్చు. మరో ప్రయాణికుడితో సైడ్ లోయర్ బెర్త్‌ను పంచుకోవాల్సి రావచ్చు. చివరి నిమిషంలో బెర్త్‌లు ఖాళీ అయితే RAC టికెట్ కూడా పూర్తి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఏ వెయిటింగ్ లిస్ట్ త్వరగా కన్ఫర్మ్ అవుతుంది?
రైల్వేలో ప్రధానంగా నాలుగు రకాల వెయిటింగ్ లిస్ట్‌లు ఉంటాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
1. GNWL (General Waiting List):
జనరల్ వెయిటింగ్ లిస్ట్‌ను GNWL అంటారు. సాధారణంగా రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి లేదా ప్రధాన స్టేషన్ల మధ్య ప్రయాణించే వారికి ఈ వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. ఇతర వెయిటింగ్ లిస్ట్‌లతో పోలిస్తే GNWL టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి.
2. RLWL (Remote Location Waiting List):
రైలు మార్గంలోని మధ్యస్థాయి ముఖ్యమైన స్టేషన్ల నుంచి ప్రయాణించే వారికి RLWL వర్తిస్తుంది. ఈ కోటాలో పరిమిత సంఖ్యలో బెర్త్‌లు ఉంటాయి. GNWLతో పోలిస్తే ఈ టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు సాధారణంగా తక్కువగా ఉండవచ్చు.
3. PQWL (Pooled Quota Waiting List):
పూల్డ్ కోటా వెయిటింగ్ లిస్ట్‌ను PQWL అంటారు. రైలులోని పలు స్టేషన్ల మధ్య ప్రయాణించే ప్రయాణికుల కోసం ఈ కోటాను కేటాయిస్తారు. ఈ కోటాలో సీట్లు పరిమితంగా ఉండటంతో కన్ఫర్మేషన్ అవకాశాలు తక్కువగా ఉండవచ్చు.
4. TQWL (Tatkal Waiting List):
తత్కాల్ కోటాలో టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్ వస్తే దాన్ని TQWL అంటారు. ఈ టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు సాధారణంగా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తత్కాల్ కోటాలో సీట్ల లభ్యత పరిమితంగా ఉండటం దీనికి కారణం.
వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అవుతుందో లేదో ఎలా తెలుసుకోవాలి?
టికెట్ బుక్ చేసుకున్నప్పుడు GNWL 5 లేదా GNWL 10 ఉంటే కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉండవచ్చు. అదే PQWL 20 లేదా RLWL 30 ఉంటే అవకాశాలు తక్కువగా ఉండవచ్చు. అయితే ఇవి కేవలం అంచనాలు మాత్రమే. రైలు, ప్రయాణ తేదీ, రూట్, కోటా, సీట్ల లభ్యత, టికెట్ల రద్దు సంఖ్య ఆధారంగా కన్ఫర్మేషన్ మారుతుంది.
పండుగలు, సెలవుల సమయంలో మరింత జాగ్రత్త!
సాధారణ రోజులతో పోలిస్తే పండుగలు, వారాంతాలు, వేసవి సెలవుల సమయంలో రైళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు తగ్గవచ్చు. అందువల్ల వీలైనంత ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది.
చార్ట్ ప్రిపరేషన్ వరకు వేచి చూడాలా?
టికెట్ బుక్ చేసిన వెంటనే వెయిటింగ్ లిస్ట్ నంబర్ చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రయాణ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ కొంతమంది ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవచ్చు. దీంతో వెయిటింగ్ లిస్ట్ నంబర్‌లో మార్పులు రావచ్చు. అందుకే చార్ట్ ప్రిపరేషన్ పూర్తయ్యే వరకు టికెట్ స్టేటస్‌ను గమనించాలి.
ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం GNWL, RLWL, PQWL, TQWL టికెట్ల కన్ఫర్మేషన్‌కు ఒకే విధమైన నియమం ఉండదు. సాధారణంగా GNWLకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ, టికెట్ కన్ఫర్మేషన్ అనేది ఆయా రైళ్లలో సీట్ల లభ్యత, క్యాన్సిలేషన్లపై ఆధారపడి ఉంటుంది. అలాగే పూర్తిగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఈ-టికెట్ చార్ట్ తయారీ తర్వాత కూడా కన్ఫర్మ్ కాకపోతే అది ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. RAC టికెట్ మాత్రం ప్రయాణానికి చెల్లుబాటు అవుతుంది.