IRCTC: ఐఆర్‌సీటీసీ బంపరాఫర్... రూ.17 వేలకే అయోధ్య, కాశీ, పూరీ దర్శనం!

IRCTC: ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా అక్టోబర్ 24 నుంచి అయోధ్య, కాశీ, పూరీ, బైద్యనాథ్ ధామ్ యాత్ర ప్యాకేజీని అందిస్తోంది. 10 రోజుల పాటు సాగే ఈ పర్యటన స్లీపర్ క్లాస్ ధర రూ.17,000 నుండి ప్రారంభమవుతుంది. ప్రయాణం, ఆహారం, వసతి, రవాణా సదుపాయాలన్నీ ఈ ప్యాకేజీలోనే చేర్చబడ్డాయి.

రూ.17 వేలకే అయోధ్య, కాశీ, పూరీ దర్శనం
రూ.17 వేలకే అయోధ్య, కాశీ, పూరీ దర్శనం
  • కాశీకి పోయినా కష్టం లేని ప్రయాణం.. టికెట్ తీస్తే చాలు దేవుడి దర్శనం గ్యారెంటీ!

  • 'జేబుకు చిల్లు పడకుండా జపం చేసుకోండి': భారత్ గౌరవ్‌తో పుణ్యం, టూర్ రెండూ పక్కా!

  • పూరీ జగన్నాథుడి నుంచి అయోధ్య రాముడి దాకా.. రైలెక్కితే చాలు మోక్షం మార్గం రెడీ!

IRCTC: తీర్థయాత్రలకు వెళ్లాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది కానీ, టికెట్లు దొరకడం, హోటళ్లు బుక్ చేసుకోవడం, సమయానికి మంచి భోజనం దొరుకుతుందో లేదో అన్న టెన్షన్లు భక్తులను వెనక్కి లాగుతుంటాయి. సరిగ్గా ఈ సమస్యలన్నింటికీ ఒకేసారి చెక్ పెడుతూ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) 'భారత్ గౌరవ్' టూరిస్ట్ రైలు పేరుతో సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. అక్టోబర్ 24 నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ద్వారా భక్తులు ఎటువంటి ప్లానింగ్ కంగారూ లేకుండా నేరుగా రైలెక్కి 10 రోజుల పాటు ప్రధాన పుణ్యక్షేత్రాలను చుట్టిరావచ్చు.

ఈ యాత్ర సికింద్రాబాద్ నుంచి మొదలై తెలంగాణ, ఏపీల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లైన విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా సాగుతుంది. అంటే గోదావరి, కృష్ణా జిల్లాల ప్రజలు తమ ఊరి స్టేషన్‌లోనే రైలెక్కి నేరుగా ఉత్తర భారత యాత్రకు చెక్కేయవచ్చన్నమాట. పది పగళ్లు, తొమ్మిది రాత్రుల పాటు సాగే ఈ పర్యటనలో భక్తులకు పూరీ జగన్నాథుని దర్శనం, కోణార్క్ సూర్య దేవాలయం, జార్ఖండ్‌లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగం బాబా బైద్యనాథ్ ధామ్ దర్శన భాగ్యం కలుగుతుంది.

అక్కడితో ఆగకుండా పుణ్యక్షేత్రాల రాజధాని వారణాసిలో కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ అమ్మవార్ల దర్శనాలతో పాటు మనసుకు ప్రశాంతతనిచ్చే గంభీరమైన గంగా హారతిని కళ్లారా వీక్షించవచ్చు. చివరిగా బాలరాముడు కొలువైన అయోధ్య రామమందిరం, హనుమాన్ గర్హి దర్శనంతో పాటు సరయూ నదీ తీరంలో జరిగే మహా హారతిలో పాల్గొనే అద్భుత అవకాశాన్ని ఈ యాత్ర కల్పిస్తోంది.

ఈ ప్యాకేజీలో అసలైన హైలైట్ ఏమిటంటే.. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.17,000 మాత్రమే కావడం. కొంచెం ఏసీ హంగులు కావాలనుకునే వారికి థర్డ్ ఏసీ రూ.26,400, సెకండ్ ఏసీ రూ.34,400గా నిర్ణయించారు. ఈ మొత్తం చెల్లిస్తే చాలు, ప్రయాణ ఖర్చుతో పాటు ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం-రాత్రి భోజనాలు, పుణ్యక్షేత్రాల్లో సైట్ సీయింగ్ కోసం లోకల్ బస్సులు, రాత్రి బస కోసం హోటల్ రూమ్‌లు మరియు ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నీ ఐఆర్‌సీటీసీయే చూసుకుంటుంది.

మొత్తానికి తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ పుణ్యం సంపాదించుకోవాలనుకునే వారికి, అన్ని ఏర్పాట్లను రైల్వేకే వదిలేసి ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఈ భారత్ గౌరవ్ స్పెషల్ రైలు యాత్ర ఒక వరం లాంటిదని చెప్పవచ్చు. టికెట్ల బుకింగ్ కోసం 92810 30714 నంబరును సంప్రదించి సమాచారం తెలుసుకోవచ్చు.

Tags

Be the first to react

Latest